Jupudi & Akula Join YSRCP: జూపూడి, ఆకుల చేరికతో వైసీపీ పార్టీకి లాభమా నష్టమా,  గొర్రెల్లాగా టీడీపీలో చేరామని చెప్పిన జూపూడీ, వస్తూనే సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం, పొరపాట్లు సరిదిద్దుకుంటామన్న మాజీ ఎమ్మెల్సీ
Jupudi Prabhakar Rao akula-satyanarayana Joined YSRCP (photo-Twitter)

Amaravathi,october 8: నిన్నటివరకు టీడీపీ నేతగా కొనసాగిన జూపూడి ప్రభాకర్‌, ఎన్నికల ముందు జనసేనలో కీలకంగా ఉన్న రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇద్దరు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జూపూడి తిరిగి సొంత గూటికి చేరారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ఆయన ప్రశంసలు గుప్పించారు. మంచి పరిపాలన రావాలని, రాజన్న పాలన తెస్తాడని ప్రజలు సీఎం జగన్‌ను ఆశీర్వదించారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ చేరుతున్న సంధర్భంలో అన్నారు. ఐదుగురు దళితులకు కేబినేట్‌లో సీఎం జగన్‌ స్థానం కల్పించారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకుందని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన బిల్లులను రాజ్యాంగ బద్ధంగా తీర్చిదిద్దారని అన్నారు. సీఎం జగన్‌ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని చెప్పారు. ఇదిలా ఉంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి ఏపీ సీఎం జగన్‌పై జూపూడి ఘాటైన విమర్శలు చేశారు. కానీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీ నేతలతో మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని చెప్పారు.

వైఎస్ఆర్సీపీలో చేరిన మరో నేత ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. జగన్ పాలన భేషుగ్గా ఉందన్నారు. రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆకుల 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత ఆయన తిరిగి బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ జగన్ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపారు. ఇదిలా ఉంటే ఆకుల సత్యనారాయణకు జగన్ రాజమండ్రి రూరల్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఓడించే బాధ్యతలను ఆకులకు అప్పగించనున్నారని సమాచారం. అందుకే ఆయన్ని పార్టీలోకి చేర్చుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆకుల సత్యనారాయణ మీడియాతో..

అయితే ఈ చేరికను వైసిపి కార్యకర్తలు చాలామంది జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది. ఫేస్ బుక్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు అనరాని మాటలు అన్న జూపూడీ మళ్లీ ఏ మొహం పెట్టుకుని వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు. జూపూడీ రాక పార్టీలో ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందో వేచి చూడాలి.