Hyderabad,Septermber 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి జూన్ 28న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గోదావరి వరద జలాలు కృష్ణా బేసిన్‌కు తరలింపు, విభజన సమస్యలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. తాజాగా ఈ రోజు మళ్లీ ఇద్దరూ భేటీ కాబోతున్నారు. ఇందకు ప్రగతి భవన్ వేదిక కానుంది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా వృథాగా పోతున్న గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే అంశం ఈ చర్చలో ఎజెండాగా ఉండనుంది. కాగా ఇదివరకే ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ షెడ్యూల్
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 9.50కి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 10 గంటలకు ఎయిర్‌పోర్టులో బయలుదేరి 10.40 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు వెళతారు. అక్కడి నుంచి 11.40కి లోటస్‌పాండ్‌లోని తన ఇంటికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం తరువాత తెలంగాణ సీఎం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవుతారు. రాత్రికి లోటస్‌పాండ్‌లో బస చేస్తారు. తిరిగి 24వ తేదీ మంగళవారం ఉదయం బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి 11.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు – అప్పుల పంపకం, ఉద్యోగుల విభజన, ఇతర పెండింగ్ అంశాలు, జలవనరుల సద్వినియోగం, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగ్ విద్యుత్తు బిల్లులు తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించనున్నట్లు తెలిసింది. వీటితోపాటు ఇతర అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటు నీటి వనరుల సమగ్ర సద్వినియోగంపై గతంలో రెండు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, సలహాదారులు, ముఖ్య కార్యదర్శులు ఇదివరకే హైదరాబాద్‌లో సమావేశమై చర్చించిన విషయం విదితమే.
గోదావరి జలాల వినియోగంపై చర్చలు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై, ప్రధానంగా గోదావరి నది జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇదే విషయమై ఇప్పటికే మూడు దఫాలు రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. దీంతో పాటుగదా గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రధానంగా చర్చకు రానుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపైనా చర్చించే అవకాశం ఉంది. వరద నీటిని అనవసరంగా సముద్రంలోకి పంపడం కన్నా వాటితో రాయలసీమలోనే కాకుండా తెలంగాణాలోనూ కరువు ప్రాంతాల్లో నీటి కష్టాలు తీర్చాలని ఇద్దరు సీఎంలు భావిస్తున్న నేపధ్యంలో జరుగుతున్న భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
అంతే కాకుండా నేడు వీరి భేటీ వెనుక పొలిటికల్ అజెండా కూడా ఉన్నట్టు , కేంద్రం ఇరు రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర వైఖరిపై కూడా చర్చించే ఆలోచనలో ఉన్నట్టు అనధికార సమాచారం. ఇక ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పోలవరం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానంగా ఈ చర్చల్లో నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి.