New Delhi, October 12: తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నటి కుష్బూ బీజేపీలో (Khushbu Sundar Joins BJP) చేరారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కీలక బాధ్యతలు సైతం అప్పగించే అవకాశం ఉంది. ఆరేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుష్బూ (Khushbu) పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఏమాత్రం ప్రజాబలం లేని నాయకుల చేతిలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శించారు. అంతేకాకుండా తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపారు.తాజాగా బీజేపీలో చేరడంతో పదేళ్ల కాలంలోనే మూడు పార్టీలను మారినట్లు అయ్యింది.
2010లో అప్పటి అధికార పార్టీ డీఎంకేలో (DMK) చేరిన కుష్బూ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉండటంతో ఆమెకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఈ క్రమంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీని ఆమె పట్టుపట్టారు. కానీ డీఎంకే-కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో సీట్లు సర్దుబాటు కారణంగా ఆమెకు ఎంపీ టికెట్ దక్కలేదు. అయితే ఆ తరువాత పార్టీ రాజ్యసభకు పంపుతామని అనేకసార్లు హామీ ఇచ్చినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.
దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కుష్బు పార్టీ మారినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై సైతం ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అయితే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Assembly Elections 2021) బలంచాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న కమళం పార్టీ (BJP) సినీ నటులను పార్టీలో చేర్చుకోవాలని తొలినుంచీ భావిస్తోంది. దీనిలో భాగంగానే సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సైతం ఇదివరకే బీజేపీలోకి ఆహ్వానించింది. దీని కొరకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న కుష్బూకు గాలం వేసినట్లుగా తెలుస్తోంది.