Nizamabad, Oct 12: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో (Nizamabad MLC Election Result) టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం (Kalvakuntla Kavitha wins ) సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మొదటి రౌండ్‌లో 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు వచ్చాయి. బీజేపీకి (BJP) 39, కాంగ్రెస్ (Congress) 22 ఓట్లు పోలయ్యాయి. 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో రౌండ్‌లో 221 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 197, బీజేపీకి 17, కాంగ్రెస్‌పార్టీకి 7 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లుబాటుకాలేదు. అక్టోబర్ 9న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు.
మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నా పోటీ నామమాత్రంగానే సాగింది. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయిలో బలం ఉండటం, దానికి తోడు బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో భారీగా చేరిపోయారు. దీంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీగా కవిత భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు, నేతలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో విజయోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి పీ లక్ష్మీ నారాయణ బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్ రెడ్డి రంగంలోకి దిగారు.