Madhya Pradesh Chief Minister Kamal Nath (Photo credit: IANS)

Bhopal, March 10: మధ్యప్రదేశ్‌లో బీజేపీ (BJP) ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. కర్ణాటక రాజధాని బెంగుళూరు (Bengaluru) కేంద్రంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ( Madhya Pradesh Political Drama) రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కమల్‌ నాథ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం (Madhya Pradesh Crisis) రోజు రోజుకు తీవ్రమవుతోంది.

అవిశ్వాస తీర్మానపు వ్యూహంలో బీజేపీ, అత్యవసరంగా సోనియా గాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్ సీఎం  కమల్‌ నాథ్

జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) విధేయులైన 17 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు మంగళవారంనాడు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా బెంగళూరులో ఉన్నారు.

సింధియా మద్దతుదారులైన మంత్రులతో సహా సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి సమాచారం లేకుండా సోమవారంనాడు బెంగళూరుకు తరలిపోవడంతో తాజా రాజకీయ సంక్షోభం మొదలైంది. ఫోనులో సైతం వారెవరూ అందుబాటులోకి రాకపోవడంతో కమల్‌నాథ్ (CM Kamal Nath) వెంటనే రంగంలోకి దిగారు.

సోమవారం పొద్దుపోయిన తర్వాత సీనియర్ నేతలతో తన నివాసంలో అత్యవసర సమావేశం జరిపారు. సమావేశానంతరం ఆయన క్యాబినెట్‌లోని మంత్రులంతా రాజీనామాలు సమర్పించారు. ముఖ్యమంత్రి పట్ల వారు తమ విధేయతను ప్రకటిస్తూ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ  చేపట్టాలని కమల్‌నాథ్‌ను కోరారు.

కాగా నేడు 12 గంటలకు రెబల్ ఎమ్మెల్యేలు (Rebal MLAs) రాజీనామా అంశంపై బెంగుళూరులో సమావేశం ఏర్పాటు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు, ప్రధాని మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఇచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపాదన చేసినట్టు కూడా చెబుతున్నారు.

కాగా సింధియా సోమవారంనాడు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌పై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేంద్రహోంమంత్రి అమిత్‌ షా కూడా పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి 9: 30 నిమిషాల అనంతరం ఈ భేటీ జరుగనుందని.. బీజేపీ నేతలు ప్రకటన చేశారు.

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై తాను వ్యాఖ్యానించేదేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) మంగళవారం మీడియాకు తెలిపారు. కమల్‌నాథ్ సర్కార్‌ను కూల్చే ఆలోచన బీజేపీకి లేదనే విషయం మొదట్నించీ తాను చెబుతూనే ఉన్నానని చెప్పారు. ప్రభుత్వం కూలిపోతే అది ఆ పార్టీ స్వయంకృతమే అవుతుందని అన్నారు.

తాజా, పరిణామాల నేపథ్యంలో సంక్షోభ నివారణకు కమల్‌నాథ్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇందుకు మార్గం సుగమం చేస్తూ ఆయన విధేయులు, మంత్రివర్గ సహచరులు సోమవారం రాత్రి తమ రాజీనామాలు సమర్పించగా, వాటిని కమల్‌నాథ్ ఆమోదించారు. దీనితో మంత్రివర్గ విస్తరణ ప్రకటనకు మార్గం సుగమమైంది.

మొత్తం230 సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 114,బీజేపీకి 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ 18మంది కమల్ నాథ్ సర్కార్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సింధియా వర్గం వారే కావడం గమనార్హం.