కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ ఎంపీగా ఉండి మంత్రి అయిన నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు సమాచారం.మంత్రిగా ముక్తార్ అందించిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. నఖ్వీతో పాటు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్ కూడా కేబినెట్ నుంచి వైదొలిగారు. మోదీ 2.0 కేబినెట్‌లో స్టీల్ శాఖ మంత్రిగా ఆర్‌సీపీ సింగ్ పనిచేశారు. మంత్రివర్గంలో ఆర్‌సీపీ సింగ్, నఖ్వీ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రశంసించినట్లు తెలిసింది.
చివరిసారిగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నఖ్వీ పాల్గొనగా.. మంత్రిగా నఖ్వీ సేవలను ప్రశంసించారు ప్రధాని మోదీ. కేబినెట్ భేటీ అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంకు వెళ్లిన నఖ్వీ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
Mukhtar Abbas Naqvi resigns as Union Minister of Minority Affairs pic.twitter.com/QNdbqHtvpw
— ANI (@ANI) July 6, 2022
మైనార్టీ నేతగా నఖ్వీకి ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన ఉపరాష్ట్రపతి రేసులో నిలపాలని బీజేపీ యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యసభ వ్యవహారాలపై నఖ్వీకి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు తెర మీదకు వచ్చింది. అయితే బీజేపీ తరపున దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.