Navjot Singh Sidhu (Photo Credits: IANS/File)

Chandigarh, September 28: పంజాబ్‌ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా (Navjot Singh Sidhu Reigns as Punjab Congress Chief) చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్‌ సింగ్‌ వ్యవహరాన్ని ప్రస్తావించారు. ఆయనకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా అమరీందర్‌ సింగ్‌పై (amarinder singh) మండిపడ్డారు. ఆయన స్వలాభం కోసం పంజాబ్‌ భవిష్యత్తు, ప్రజల సంక్షేమం పట్ల వివక్షతకు పాల్పడుతున్నారని అన్నారు.

అందుకే తాను రాజీనామా చేస్తున్నానని వివరించారు. కాగా, ఈ రోజు (మంగళవారం) సాయంత్రం బీజేపీ నేతలను కలిసేందుకు అమరీందర్‌ సింగ్‌ ఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి (Punjab Congress President) చేపట్టిన 72 రోజులకే సిద్దూ రాజీనామా చేయడంతో పంజాబ్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం వరకు పంజాబ్‌లోనే ఉన్నారు. కాగా, వీరు వెళ్లగానే సిద్దూ రాజీనామా అస్త్రాన్నిసంధించారు. తన రాజీనామాలో సిద్ధూ.. మనం రాజీపడిన రోజు మన వ్యక్తిత్వం పతనమైనట్లే అని ఘాటుగా స్పందించారు.

మళ్లీ మోగిన ఎన్నికల నగారా, మూడు లోక్‌సభ స్థానాలకు, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికలు, నవంబరు 2న ఓట్ల లెక్కింపు

కాగా ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌కు జీర్ణించుకోలేని పరిణామాలు సంభవించాయి. సిద్దూ (Navjot Singh Sidhu) ఆరోపణల నేపథ్యంలో అమరీందర్‌సింగ్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్‌ దించిన విషయం తెలిసిందే. ఇటు అమరీందర్‌ సింగ్‌ను.. అటూ సిద్దూను కాంగ్రెస్‌ ఇద్దరిని దూరం చేసుకుని ఇరకాటంలో పడింది. అయితే సిద్దూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీకి ప్రయాణం కావడం, బీజేపీ పెద్దలను కలుస్తారనే ప్రచారం జరగడంతో పంజాబ్‌ రాజకీయాలు వేడెక్కాయి.

ఇక పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లడంపై వస్తున్న ఊహాగానాలను ఆయన మీడియా అడ్వయిజర్ రవీన్ థుక్రాల్ కొట్టివేశారు. వ్యక్తిగత పర్యటన కోసమే కెప్టెన్ ఢిల్లీ వెళ్లారని, తన సన్నిహితులను కలుసుకుంటారని, కొత్త సీఎం కోసం కపుర్తలా హౌస్‌ను ఖాళీ చేయనున్నారని తెలిపారు. అనవసర ఊహాగానాలకు తావేలేదని ఆయన వివరణ ఇచ్చారు.

నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్ధూకు నిలకడ లేదని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాదని కెప్టెన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిద్ధూ దేశానికి ప్రమాదకారి అని అమరీందర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన నొచ్చుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కొత్తగా తన మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి మంగళవారంనాడు శాఖలు కేటాయించారు. తన వద్ద 14 శాఖలు ఉంచుకున్నారు.  విద్యుత్, విజిలెన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, జస్టిస్, సివిల్ ఏవియేషన్, పర్యావరణం, లీగ్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్, మైనింగ్ అండ్ జియాలజీ, ఎక్సైజ్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, హాస్పిటాలిటీ, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు వంటి శాఖలు ఆయన వద్దే ఉన్నాయి.

ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధ్వాకు హోం శాఖ, కార్పొరేషన్, జైళ్ల శాఖలను కేటాయించారు. మరో ఉప ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ సోనికి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రక్షణ సేవలు, స్వాతంత్ర్య సమరయోధుల సంక్షేమం శాఖలు కేటాయించారు.