
Hyderabad, January 13: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు (Telangana Municipal Polls) సమీపిస్తున్న తరుణంలో అధికార- విపక్షాల మధ్య విమర్శల దాడి పెరిగింది. పురపాలక, నగరపాలక ఎన్నికల్లో లోకసభ ఫలితాలను రిపీట్ చేస్తామని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ (Kova Laxman) అన్నారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పోరేషన్లను బీజేపీ (BJP) కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ (TRS) కు బీజేపీ అంటే భయం పట్టుకుందని, అడ్డదారుల్లో గెలిచేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. కుటుంబ పాలన, అవినీతికి చరమగీతం పాడాలంటే బీజేపీకి ఓటేయాలని ఓటర్లను కోరారు. తెరాస ముసుగులో తెలంగాణలో బలపడాలని చూస్తున్న మజ్లిస్ ప్రయత్నాలను భగ్నం చేస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు.
లక్ష్మణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Kalvakuntla Taraka Rama Rao) స్పందించారు. బీజేపీకి ఆరేడు వందల్ల వార్డుల్లో అభ్యర్థులు కూడా లేరని చెప్పారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలప్పుడు కూడా తమపై ఇష్టారీతిన దుష్ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి రాలేదని గుర్తుచేశారు. అలాంటిది బీజేపిని చూసి తెరాస భయపడుతుందన్న లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక టీపీసీసీ (TPCC) ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పై కూడా కేటీఆర్ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీలకు ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఎల్ఈడీ బల్బులతో మున్సిపాలిటీలను ఆధునీకరించడమే కాకుండా కోట్లరూపాయల విద్యుత్ ను ఆదా చేసినట్లు చెప్పారు. నిరంతర మంచినీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలు చేయడమే తమ ముందున్న బాధ్యత అని కేటీఆర్ చెప్పారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా తాము ఎవరికీ భయపడబోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచార తేదీలు మరియు పోలింగ్ జరిగే తేదీ కోసం ఇక్కడ చూడవచ్చు.
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమైన కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. సంక్రాంతి పండగ సందర్భంగా పతంగులకు టీఆర్ఎస్ గుర్తులు అతికించి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు.