Opposition to Boycott Rajya Sabha: ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేయాలి, అప్పటివరకు సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని తెలిపిన విపక్షాలు, ఎంపీల తీరుకు నిరసనగా ఒక రోజు దీక్ష చేపట్టిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్
Ghulam Nabi Azad (Photo Credit: Twitter)

New Delhi, Sep 22: రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల దుమారం కొనసాగుతూనే ఉంది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు చట్టంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో 8 మంది సభ్యుల వేటు కూడా పడింది. అయితే ఈ సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్‌ (Opposition to Boycott Rajya Sabha) చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ (Ghulam Nabi Azad) మంగళవారం పేర్కొన్నారు.

సభ్యులపై సస్పెన్షన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తి వేసేవరకు (8 members revoked) రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ బిల్లులపై పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.మరోవైపు సభ్యుల సస్పెన్షన్ పై తాను సంతోషంగా లేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఎంపీల ప్రవర్తన కారణంగానే చర్యలు తీసుకున్నామని.. ఏ సభ్యుడిపై కూడా వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే సస్పెండ్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని పచ్చిక బయళ్లలో రాత్రంతా నిరసన కొనసాగించిన ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం ఉదయం పరామర్శించారు.

సస్పెండ్ ఎంపీలకు టీ ఇచ్చిన డిప్యూటీ చైర్మన్, మా పోరాటం టీ కోసం కాదు..రైతుల కోసమన్న విపక్షాలు, రాత్రంతా మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో సస్పెన్షన్‌ ఎంపీలు

టీ కప్పులతో దౌత్యం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులకోసం ఉద్యమిస్తాం..పార్లమెంటు హత్యకు గురైందనే ప్లకార్డులతో నిరసనను కొనసాగిస్తున్న ఎంపీలు మాత్రం "టీ దౌత్యాన్ని" నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రైతు వ్యతిరేకి అంటూ ఆయనను దుయ్యబట్టారు. దీంతో తాను కూడా ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ ప్రకటించడం విశేషం.

కాగా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్‌ ఓటింగ్‌ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్‌ బుక్‌ను విసిరేయడం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఈ అంశంపై రగడ సోమవారం కూడా కొనసాగింది. దీంతో సభా మర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్‌ చేశారు.ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

కొత్త చట్టంతో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు పోతుంది, ఆ భయంతోనే విమర్శలు చేస్తున్నారు, బీహార్‌లో ప‌లు ప్రాజెక్టుల శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు

టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్, ఆప్‌ సభ్యులు సంజయ్‌ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్‌ ఎంపీలు రాజీవ్‌ సత్వ, సయ్యద్‌ నాజిర్‌ హుస్సేన్, రిపున్‌ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్‌ కరీన్‌లను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్‌ వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు

ఇక వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ హరివంశ్‌ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు ఒక లేఖ రాశారు. సభలో పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయనీ, దీంతో రాత్రి నిద్ర కూడా పట్ట లేదని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. తన నిర్ణయం వారిలో “స్వీయ శుద్దీకరణ” భావనను ప్రేరేపిస్తుందని భావిస్తున్నానన్నారు. మరోవైపు తనపై దాడిచేసి, అవమానించిన వారికి వ్యక్తిగతంగా టీ ఆఫర్ చేయడం గొప్ప విషయమంటూ హరివంశ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలుకురిపించారు. ఆయన ఔదార్యం, శైలి ఆదర్శప్రాయం, ప్రజాస్వామ్యానికి ఇది చక్కటి సందేశం అంటూ ట్వీట్ చేశారు.