Newdelhi, Sep 18: సార్వత్రిక ఎన్నికల (General Elections) ముందు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Sessions) నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ఇవాళ్టి నుంచి అయిదు రోజుల పాటు జరగనున్నాయి. పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణంపై.. చర్చే ప్రధాన ఎజెండాగా.. ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్నా, ఏదైనా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. తొలిరోజు పాత భవనంలో సమావేశాలు జరుగనున్నట్టు సమాచారం. పాత భవనంలో ఆఖరిసారిగా సభ కొలువుదీరనున్నట్టు చెబుతున్నారు. ఇక, పార్లమెంట్ నూతన భవనంలో జరగనున్న ఈ సమావేశాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు సహా జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై.. కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
It will be possibly last time that we will see Old Parliament functioning today. pic.twitter.com/eIE68dSDzk
— News Arena India (@NewsArenaIndia) September 18, 2023
కీలక బిల్లులు కూడా..
అయితే.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్, బీజేడీ సహా పలు ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాయి. మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నట్లు ఆయా ప్రాంతీయ పార్టీలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మార్చే తీర్మానం కూడా చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.