New Delhi, Oct 28: భారత దేశ రాజకీయాల్లో బీజేపీ పాత్రపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలను మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ (BJP Not Going Anywhere for Many Decades) ప్రభావితం చేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే బీజేపీ (BJP) కేంద్రంగానే భారత రాజకీయాలు కొనసాగుతాయి. స్వాతంత్య్రానంతరం నుంచి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ (Congress) ఎలాంటి స్థానంలో ఉందో బీజేపీ మరికొన్ని దశాబ్దాల పాటు అలాంటి స్థానంలోనే ఉంటుంది.
ప్రధానమంత్రి మోదీని (PM Modi) ప్రజలు విసిరికొడతారని కొందరు అంటున్నారు. 30 శాతం ఓటు బ్యాంక్ సాధించిన ఏ పార్టీ అయినా ప్రజల నుంచి అంత తొందరగా పోదు. మోదీ ఉంటారా లేదా అనేది పక్కన పెడితే బీజేపీ మాత్రం ఉంటుంది. చాలా దశాబ్దాల పాటే ఉంటుంది. మరికొన్ని దశాబ్దాలు బీజేపీ చుట్టే రాజకీయం నడుస్తుంది’’ అని ప్రశాంత్ కిశోర్ వీడియోలో అన్నారు. ఆయన గోవాలో మాట్లాడినట్టుగా భావిస్తున్న వీడియోను బీజేపీకి చెందిన అజయ్ సెహ్రావత్ సహా పలువురు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని గ్రహించడం లేదని, మోదీని ప్రజలు విసిరి కొడతారని రాహుల్ ఇంకా అనుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘‘రాహుల్ గాంధీకి బహుశా ఇదే సమస్య కావచ్చు. మోదీని ప్రజలు విసిరి కొడతారని ఆయన భ్రమపడుతున్నారు. ఇలాంటిదేమీ జరగదు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయండి మోదీ ఎంత బలంగా ఉన్నారో అర్థం అవుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరూ ఆయనకు ఎదురు వెళ్లలేరు కూడా’’ అని ప్రశాంత్ కిశోర్ వైరల్ అవుతున్న వీడియోలో అన్నారు.
Here's Prashant Kishor Video
Watch : Prashant Kishor says, “But BJP is not going anywhere, they are going to be here for the next few decades." pic.twitter.com/kTKUMIAub3
— The Bite (@_TheBite) October 28, 2021
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అజయ్ సెహ్రావత్ స్పందించారు. బీజేపీ ప్రభావాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా అంగీకరించారని, అయితే ఈ విషయాన్ని అమిత్ షా గతంలోనే చెప్పారని ఆయన ట్వీట్ చేశారు. ‘‘మరిన్ని దశాబ్దాల పాటు భారత రాజకీయాల్ని బీజేపీనే ఏలుతుందని ప్రశాంత్ కిశోర్ కూడా అంగీకరించారు. ఇదే నిజం కూడా. ఈ విషయాన్ని అప్పుడెప్పుడో అమిత్ షా డిక్లేర్ చేశారు కూడా’’ అని సెహ్రావత్ అన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరనున్నారనే అంచనాలు మధ్య అధిష్టానం, గాంధీలతో ఆయన చర్చలు విఫలమయ్యాయనే సంకేతాలందిస్తున్న ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చాలా క్లిష్టమైన సమయాల్లో బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీకి, తమిళనాడులో సీఎం స్టాలిన్‌కు, ఏపీలో వైఎస్ జగన్ కు అద్భుతమైన విజయాలను అందించిన ప్రశాంత్ కిషోర్‌కు తాజాగా గాంధీలతో చర్చలు పొసగలేదని సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ప్రాణాలుకోల్పోయిన బాధిత రైతుల కుటుంబాలను కలవడానికి వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎత్తు గడలు, కాంగ్రెస్ శ్రేణుల అంచనాలను ప్రశాంత్ ప్రశ్నించారు. దురదృష్టవశాత్తూ, కాంగ్రెస్‌లో లోతుగా పాతుకుపోయిన సమస్యలు, నిర్మాణాత్మక బలహీనతలకు శీఘ్ర పరిష్కారాలు లేవని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.