Prashant Kishor Joins Congress?: 2024లో మోదీని దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్‌తో మంతనాలు, పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త రాకపై కొనసాగుతున్న సస్పెన్స్
Prashant Kishor- Screenshot of Archana Dalmia's tweet (Photo Credits" PTI/Twitter)

New Delhi, July 14: కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ, పార్టీ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి విదితమే. ఈ నేపథయంలో కాంగ్రెస్‌లో ఆయన చేరడంపై (Prashant Kishor Joins Congress?) ఊహాగానాలు పెరిగాయి. తాజాగా కాంగ్రెస్ నేత అర్చన (Archana Dalmia) కూడా కాంగ్రెస్ ఫ్యామిలీలోకి ప్రశాంత్‌ కిషోర్‌ కి స్వాగతమంటూ ట్వీట్ చేసింది. ఏమయింది ఏమో వెంటనే డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా రారా అనేదానిపై సస్పెన్స్ నెలకొని ఉంది.

ఇక 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆ లోపు రానున్న పలు అసెంబ్లీల ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్దమవుతున్న పరిస్థితుల్లో.. పార్టీలో ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishor) పోషించాల్సిన కీలక పాత్రపై సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ సందర్భంగా చర్చ జరిగి ఉండవచ్చని పార్టీ వర్గాలు సంకేతాలిచ్చాయి. సోనియా, రాహుల్, ప్రియాంకలతో ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశం కావడం ఇదే మొదటిసారి కాదని వెల్లడించాయి.అయితే ప్రశాంత్‌ కిశోర్‌ వస్తే పార్టీలో ఏ బాధ్యతలు అప్పజెప్తారన్న విషయంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. అందరూ అనుకొన్నట్టు ఇది పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు మాత్రమే పరిమితమైన సమావేశం కాదని, అంతకంటే పెద్ద లక్ష్యమే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం, సెప్టెంబర్ నుంచి పెరిగిన డీఏ అమల్లోకి..

2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సాధించిపెట్టే బృహత్తర బాధ్యతను ప్రశాంత్‌ కిషోర్‌పై పెట్టాలని సోనియా భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేకు ప్రశాంత్‌ కిషోర్‌ విజయం సాధించిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ తరహా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు చేస్తున్న పనిని కొనసాగించాలని అనుకోవట్లేదు. ఇప్పటివరకు చేసింది చాలు. విరామం తీసుకుని, కొత్తదేదైనా చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నా’ అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మే నెలలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆయన స్పష్టం చేశారు.

మాస్టర్‌కార్డ్‌ వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్, కొత్తగా వినియోగదారులను చేర్చుకోవద్దని మాస్టర్‌కార్డ్‌కు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ, ఈ నెల 22 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి

మళ్లీ రాజకీయాల్లోకి వెళ్తారా? అన్న ప్రశ్నకు.. ‘నేను ఒక విఫల రాజకీయవేత్తను. ముందుగా, నేనేం చేయగలను అనే విషయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ కాంగ్రెస్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ కలిసి పని చేశారు. పంజాబ్‌ ఎన్నికల్లో కిషోర్‌ వ్యూహాల సాయంతోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే, ఆ తరువాత పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రశాంత్‌కిషోర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ 100 ఏళ్ల వయస్సున్న రాజకీయ పార్టీ. ఆ పార్టీ పనితీరు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రశాంత్‌ కిషోర్‌ వంటి వ్యక్తుల నుంచి సలహాలు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉండరు. నా పనితీరు వారికి సరిపడదు’ అని గతంలో వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రశాంత్‌ కిశోర్‌ పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు మరింత బలం ఇచ్చేలా… ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ హరీశ్‌ రావత్‌ వ్యాఖ్యలు చేశారు. కానీ మూడు నాలుగు రోజుల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ శుభవార్త వింటారని అన్నారు. ‘శుభవార్త అంటే ఒక పంజాబ్‌కే కాదు. కాంగ్రెస్‌ కార్యకర్తలందరికీ శుభవార్త’ అని చెప్పారు.