N Rangaswamy and Nirmal Kumar Surana (Photo-ANI)

Chennai, May 3: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిని ఎన్‌డీఏ కూటమి (NDA) సొంతం చేసుకుంది. ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ (NR Congress) నేతృత్వంలోని ఈ కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దాదాపు ఖాయమైపోయింది. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో (Puducherry Election Results 2021) ఈ కూటమి తరఫున ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 16, బీజేపీ 9, అన్నాడీఎంకే 5 స్థానాల్లో పోటీ చేశాయి.

ఇందులో వార్తలు అందేసరికి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10, బీజేపీ 6 చోట్ల విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన(మ్యాజిక్‌ ఫిగర్‌) 16 స్థానాలను ఈ కూటమి ఇప్పటికే దక్కించుకోవడంతో ఎన్‌డీఏ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైపోయింది. ఈ సారి ఇక్కడ అన్నాడీఎంకే ఖాతా తెరవలేదు. ఆపార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం ఇదే ప్రపథమం కావడం గమనార్హం. డీఎంకే – కాంగ్రెస్‌ కూటమికి ఆశించిన గెలుపు దక్కలేదు. అయితే, డీఎంకే మూడు చోట్ల గెలవగా, రెండు చోట్ల ఫలితం తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ రెండు చోట్ల గెలిచింది.

మరో ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించడంతో వారిని కూడా దరి చేర్చుకునే సన్నాహాల్లో ఎన్‌డీఏ నేతలు ఉన్నట్లు సమాచారం. కాగా, రెండు నియోజకవర్గాల్లో పోటీకి దిగిన రంగస్వామి(rangaswamy) తట్టాన్‌చావడిలో గెలిచినా, యానాంలో మాత్రం ఓడిపోయారు. కాగా, మొన్నటి వరకూ ఇక్కడ అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. మరోవైపు.. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు బలపరిచిన అభ్యర్థి ఎన్‌. రంగస్వామి ఓటమిపాలయ్యారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మద్దతిచ్చినా రంగస్వామి అపజయం పొందారు.

అసోం మళ్లీ బీజేపీదే, కాంగ్రెస్ పార్టీకి రెండో సారి పరాభవం, 74 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి, 52 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌ మహాకూటమి

పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా ప్రకటించుకున్నా, నేతృత్వంపై మాత్రం సందిగ్ధం నెలకొంది. అయితే, రంగస్వామి నేతృత్వంలోనే కూటమి అని, ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రకటించుకుంది.

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేసి బీజేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ల వైపుగా వెళ్లడంతో సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో పుదుచ్చేరిలో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఎన్డీయే కూటమి నుంచి ఎవరు పుదుచ్చేరికి ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత రంగస్వామికి పుదుచ్చేరిలో మంచి పేరు ఉన్నది. ఇప్పటికే ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాజకీయాలు తప్ప మరొకటి ఆయనకు తెలియవు. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతు వీధుల్లో కనిపించిన అందరిని పలకరిస్తుంటాడు. నిరాడంబరమైన వ్యక్తి. మోటార్ బైక్ మీద అసెంబ్లీకి వెళ్తుంటారు. ఇంటికి దగ్గరలో ఉన్న టీ స్టాల్ లో టీ తాగడం ఆయనకు అలవాటు. రంగస్వామినే ముఖ్యమంత్రి కావాలని అన్నాడీఎంకే పట్టుబడుతున్నది. అయితే, బీజేపీ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రి పదవిపై క్లారిటీ రానున్నది.