Pawan Kalyan: 'ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతే 151 సీట్లు ఎందుకు'? రేప్ ఘటనలపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరస్తులకు సింగపూర్ తరహా శిక్షలు ఉండాలంటూ సూచన
Janasena Cheif Pawan Kalyan | File Photo.

Tirupathi, December 2: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు రాయలసీమకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పవన్ మాట్లాడారు. షాద్‌నగర్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ఘటన (Shadnagar Incident)పై కూడా పవన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలను వేధించే వారిని తోలు ఊడేలా కొట్టాలన్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారు అనే భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఆడబిడ్డల మానప్రాణాలను రక్షణ కల్పించలేనప్పుడు 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటి? అని పవన్ ప్రశ్నించారు.

తాను అక్కాచెల్లెల్ల మధ్య పెరిగిన వాడినని, వారిని బయటకు పంపిస్తే తిరిగొచ్చేంత వరకు ఒక అన్నగా, తమ్ముడిగా గుండెల్లో ఒక భయం కలిగేదని తెలిపారు. నాయకులు బూతులు మాట్లాడటం వల్లనే రోడ్డు మీద రేపిస్టులు బలత్కారాలు చేస్తున్నారు. అదే నాయకుల మధ్య చిత్తశుద్ధి ఉంటే, బలంగా మాట్లాడితే, మా నాయకులు ఇంత 'బాధ్యతారాహిత్యంగా' ఉన్నారు,  మనం ఏదైనా అంటే చంపేస్తారు అనే భయం ఉంటే అక్కడ రేపులు చేయనివ్వదు అని పవన్ అన్నారు. రాజకీయాలు కుళ్లిపోయి ఉన్నాయి కాబట్టి మనమేదైనా చెయ్యొచ్చనే ధైర్యం అలాంటి వారికి వస్తుందని పవన్ తెలిపారు. రేపిస్టులకు సింగపూర్ తరహా శిక్షలు అమలు చేయాలని అన్నారు.

వెటర్నరీ డాక్టర్ దిశ ఘటనలో ఆ నలుగురిని తీసుకెళ్లి చర్లపల్లి జైలులో పెడితే కొన్ని వేల మంది అక్కడికి చేరుకొని వారిని చంపేయాలని, ఉరితీయాలని కోరుకుంటున్నారు. దిల్లీ స్థాయిలో ఒక జడ్జి రేపిస్టుల మర్మాంగాలు కోసేయాలని వ్యాఖ్యానించారని పవన్ పేర్కొన్నారు. అంతటి ఆగ్రహావేశాలు దేనికి, అసలు అంతదాకా ఎందుకు వెళ్లడం? ఆ నిందితులను అందరూ చూస్తుండగా రోడ్డు మీద తోలు ఊడిపోయేలా బెత్తం దెబ్బలు కొట్టండి, ఒక మనిషిని చంపే హక్కు కూడా మనకు లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒకరు మర్డర్ చేస్తే , వారిని కూడా మర్డర్ చేయాలని కోరుకోవడం ఉన్మాదమేనని పవన్ అన్నారు. అయితే చంపడం కాకుండా శిక్షా ధర్మాన్ని పాటించాలని తెలిపారు. దేవతల చేతుల్లో ఒక అభయ హస్తం, ఒక చేతిలో ఆయుధాలు  కలిగి ఉంటుంది. దాని భావం ఇదేనని పవన్ తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు 2017లో కర్నూల్ కు చెందిన సుగాలి అనే స్కూల్ విద్యార్థిని అత్యాచారం చేసి, హత్య చేసి అవి నిరూపించబడినా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పవన్ మండిపడ్డారు.  "చంద్రబాబు ప్రభుత్వం ఏది చేసినా, దానికి వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి క్షమించాలి జగన్ రెడ్డి" అందుకు వ్యతిరేకంగా చేస్తారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగే అన్నింటికి ఎదురెళ్లే జగన్ రెడ్డి, సుగాలి కేసు విషయంలో ఎందుకు ఎదురెళ్లడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏడుకొండలకు తప్ప అన్నింటికీ వైసీపీ రంగులేస్తుందని పవన్ దుయ్యబట్టారు. రాయలసీమలో ముఠా కక్షలు, పాలెగాళ్ల సంస్కృతి, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువగా జరిగేది ఈ ప్రాంతంలోనే

అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఒక అంశాన్ని మరో అంశంతో ముడిపెడుతూ అర్థంలేకుండా మాట్లాడుతున్నారని, అటు ఇటు తిరిగి మళ్ళీ జగన్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ అంటే అంత ద్వేషం దేనికి, అత్యాచారాలకు 151 ఎమ్మెల్యేలకు ఏమైనా సంబంధం ఉందా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా అందుకు జనసైనికులు కూడా కౌంటర్లు ఇస్తూ పోతున్నారు.