File image of Lok Sabha Speaker Om Birla | (Photo Credits: PTI)

New Delhi, March 5: ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పార్లమెంట్‌లో (Parliament Session) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సభలో అనైతికంగా వ్యవహరించారంటూ లోక్‌సభలో ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలను స్పీకర్‌ ఓం బిర్లా గురువారం సస్పెండ్‌ (Seven Congress MPs Suspended) చేశారు. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై స్పీకర్‌ ఓంబిర్లా (Om Birla) చర్యలు తీసుకున్నారు. ఈ ఏడుగురు ఎంపీలను లోక్‌సభ సమావేశాల మిగిలిన రోజులకు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

ఇది పార్లమెంటు..బజారు కాదు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం

సస్పెండ్‌ అయిన ఎంపీల్లో గౌరవ్‌ గోగోయ్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కురియాక్స్‌, మాణిక్‌ ఠాకూర్‌, బెన్నీ బెహ్నన్‌, గర్జిత్‌ అహ్లువాలియా, ఆర్‌. ఉన్నితన్‌ ఉన్నారు. ప్రస్తుత సెషన్‌లో మిగిలిన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కాకుండా వీరిపై స్పీకర్‌ వేటు వేశారు. కాగా సస్పెన్షన్‌కు గురైన సభ్యులు పేపర్లను చింపి వాటిని లోక్‌సభ స్పీకర్‌పై విసరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా తమ సభ్యులపై వేటు వేయాలన్న నిర్ణయం స్పీకర్‌ది కాదని, ఇది ప్రభుత్వ నిర్ణయమని లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరి ఆరోపించారు. సస్పెన్షన్‌ నిర్ణయానికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తమ పోరాటం​సభ లోపల, వెలుపల కొనసాగుతుందని చెప్పారు.

Updated by ANI

 

వాయిదాలు వేయకుండా వెంటనే విచారణ చేపట్టండి

కాగా బడ్జెట్‌ సమావేశాలు (Budget session) హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు మాటాల తూటాలతో వేడెక్కిస్తున్నారు. ఒకరికొకరు తోసుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొక దశలో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను నిర్వహించలేనంటూ అశక్తత వ్యక్తం చేశారు.

ఈ సమావేశాల్లో హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు కూడా వెళ్లి అమిత్‌షా రాజీనామా డిమాండ్‌ ఉన్న నల్లని బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘అల్లర్లకు కారణం వీరే. వీరే రెచ్చగొట్టారు. 1984లోనూ వీరు 3000 మందిని హతమార్చారు. వీరికి శాంతి నెలకొనడం ఇష్టం లేదు’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దీంతో విపక్ష సభ్యులు మరింత బిగ్గరగా.. ‘వి వాంట్‌ జస్టిస్‌’, ‘అమిత్‌ షా ముర్దాబాద్‌’ అని నినాదాలు చేయసాగారు. ఈ సమయంలో, కాంగ్రెస్‌ సభ్యులు నల్ల బ్యానర్‌తో అధికార పక్ష సభ్యుల వైపు వెళ్లారు. బీజేపీ సభ్యులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు చేతిలోని కాగితాలను చించి, విసిరేశారు.

మరోవైపు రాజ్యసభలోనూ తీవ్ర దుమారం రేగుతోంది. ఢిల్లీ అల్లర్లపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజ్యసభలో స్పీకర్ వెంకయ్యనాయుడు ఇదేమి బజారు కాదు, పార్లమెంట్ అనే స్థాయిలో మాటల తూటాలు పేలాయి.