Mumbai,November 10: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు ఎవరు చేస్తారనే ప్రశ్నకు సమాధానం చిక్కడం లేదు. ఎవరికి వారే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర(Maharashtra)లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని శివసేన (Shiv Sena) స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని ఎవరూ ఏర్పాటు చేయలేకపోయిన పక్షంలో తమ వ్యూహం ఏమిటో అప్పుడు ప్రకటిస్తామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ (Shiv Sena leader Sanjay Raut) తెలిపారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటుకు బీజేపీ(BJP)ని ఆహ్వానించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి (Governor Bhagat Singh Koshyari)తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. గవర్నర్ చొరవతో రాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటమవుతుందనే ఆశాభావంతో ఉన్నామని చెప్పారు.
ఏకైక పెద్ద పార్టీని ఆహ్వానించడం సహజమే. కానీ, మెజారిటీ ఉందనుకున్నప్పుడు ఫలితాలు వెలువడిన 24 గంటల్లోనే ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఎందుకు ముందుకు రాలేదో మాకు అర్ధం కావడం లేదు' అని రౌత్ అన్నారు. శివసేన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ, గవర్నర్ వేసిన మొదటి అడుగుపై స్పష్టత వచ్చి, ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకుంటే అప్పుడు శివసేన తమ వ్యూహాన్ని ప్రకటిస్తుందని చెప్పారు.
రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం లోగా బలనిరూపణ చేసుకోవాలని తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర గవర్నర్ కోరిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆహ్వానం మేరకు అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేసుకోవాలని, ఇందులో ఆ పార్టీ విఫలమైతే ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ ముందుకు వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం దీర్ఘకాలం అనిశ్చితి కొనసాగడం మంచిది కాదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరిస్తే రెండవ పెద్ద కూటమిగా ఎన్‌సీపీ-కాంగ్రెస్‌ను మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత మిలింద్ డియోరా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.