Chennai, May 2: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Tamil Nadu Assembly Elections 2021) డీఎంకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(117)కు కావాల్సిన స్థానాలను దాటేసి ముందంజలో నిలిచింది. ఇక తమిళనాడులో డీఎంకేదే (DMK) అధికారం అంటూ సర్వేలన్నీ ఆ పార్టీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలన్నీ నిజమయ్యేలా స్టాలిన్ (Stalin DMK) నేతృత్వంలోని డీఎంకే రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం కనబరుస్తుండటంతో పార్టీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. విరుదాచలంలో విజయ్‌కాంత్ భార్య ప్రేమలత వెనుకంజలో ఉన్నారు.
కొలత్తూర్‌లో స్టాలిన్ ముందంజలో ఉన్నారు. కోయంబత్తూర్ సౌత్‌లో పోటీ చేస్తున్న మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ (kamal Hasan) స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం డీఎంకే 108 స్థానాల్లో ముందంజలో ఉండగా, అన్నాడీఎంకే 86 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇతరులు 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
సీఎం పళనిస్వామి (CM Palaniswami) స్వయంగా బరిలో దిగిన సాలెం నియోజకవర్గంలో తొలి నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. పళనిస్వామి 14 వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. పళస్వామికి 23,221 ఓట్లు పోలవగా, తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థికి కేవలం 8,364 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొలతూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గంలో లీడ్‌లో ఉన్నారు.
తమిళనాడులో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన అన్నాడీఎంకే తొలిసారి బీజేపీతో కలిసి బరిలోకి దిగింది. అయితే అన్నాడీఎంకే పాలనపై వ్యతిరేకత, పార్టీలో లుకలుకలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకేను ప్రజలు ఆదరించినట్లు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఆధిక్యంలో ఉన్నారు.