Hyderabad, June 4: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తునట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈటల రాజేంధర్, తన అనుభవాలను, ఆవేదనను పంచుకున్నారు. అదే సమయంలో కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ శైలిలోనే ఛలోక్తులు విసురుతూ విమర్శల బాణాలు సంధించారు.
ఈటల మాట్లాడుతూ రాత్రికి రాత్రే తనను మంత్రి పదవికి బర్తరఫ్ చేశారని, ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని అన్నారు. ఒక అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా? ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారు, కనీసం తన వివరణ కూడా అడగరా? అని ఈటల ప్రశ్నించారు.
తన ఎమ్మెల్యే పదవిపై కూడా అనర్హత వేయాలని వార్తలు విన్నాను, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సార్లు రాజీనామా చేశాను, ప్రజల ఆశీర్వాదంతో పోటీ చేసిన ప్రతీసారి గెలిచాను. అలాంటి బ్రతుకు కలిగి ఇప్పుడు చెడొద్దు అనే ఉద్దేశ్యంతో తెరాసతో తన 19 ఏళ్ల అనుబంధానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈటల రాజేంధర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం తనను గెలిపించిందని, ఆత్మగౌరవ బావుట తనను గెలిపించిందని ఈటల రాజేంధర్ అన్నారు. ఏదో పార్టీ బీఫాం ఇస్తే అందరూ గెలవలేరని, నిజామాబాద్ లో పోటీ చేసిన ఆయన సొంత కూతురు ( కేసీఆర్ కూతురు కవిత) ఓడిపోయిందని ఈటల గుర్తు చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రికి స్వేచ్ఛ లేదు, ఏ ఒక్క అధికారికి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదు. బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు? అని ఈటల అన్నారు, ప్రగతి భవన్ కాదు అది బానిస భవన్ అని పేరుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. తాను ఏనాడు మంత్రిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వ్యతిరేకించలేదు.. వందల కోట్లు టాక్సు కడుతూ బెంజ్ కార్లలో వచ్చి రైతు బంధు తీసుకునే వారికి ఆ పథకం వర్తింపజేయొద్దు, నిజమైన రైతులకు పేదవారికి ఇవ్వాలని మాత్రమే చెప్పాను అది తప్పా అని ఈటల ప్రశ్నించారు.
తాను ఎవరికీ బానిసగా ఉండనని, తాను కూడా ఒక ఉద్యమకారుణ్నే అని ఈటల రాజేంధర్ గుర్తుచేశారు. ఆకలినైనా భరిస్తాను కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోను, హరీష్ రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని ఈటల అన్నారు.
ఆయన (కేసీఆర్) ఎప్పుడూ తనదే చలామణీ కావాలని భావిస్తారు, ఈ ఎమ్మెల్యేలు.. మంత్రులు అవసరమా? తన ఒక్కడికే ప్రజలు ఓటేసి గెలిపించుకుంటే చాలదా? అన్నట్లుగా వ్యవహరిస్తారు. అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అని అణిచివేసే ధోరణిలో ఉంటారు. ఇది ప్రజాస్వామ్య స్పూర్థికి, రాజ్యాంగ స్పూర్థికి విరుద్ధం అని ఈటల అన్నారు.
తెలంగాణలో 4 కోట్ల ప్రజలు, 119 ఎమ్మెల్యేలు, 17 మంది మంత్రులు. కనీసం ఈ 17 మంది మంత్రులపైనా ఆయనకు నమ్మకం లేకపోతే ఆయనకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఈటల రాజేంధర్ కేసీఆర్ ను పరోక్షంగా విమర్శించారు. ఇప్పుడు తనను ఏకపక్షంగా అణిచివేయవచ్చు గాక, కానీ ఆయనే ఒక మాట చెప్పారు 'పొట్టొని నెత్తిని పొడుగోడు కొడితే, పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందట'.. ఇప్పుడు నేను పొట్టొడిని నన్ను కొడితే రేపు ప్రజాస్వామ్యం అనేది ఒకటుందని కేసీఆర్ వ్యాఖ్యలనే ఈటల తిరిగి అప్పజెప్పారు.
గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టురోగినైనా కౌగిలించుకుంటా అని తెలంగాణ ఉద్యమ సమయంలో అన్న మాటలు, ఆ నీతి ధర్మం ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. ఆయనకు ఇంటివాళ్లు బయటి వాళ్లు అయ్యారు, బయటి వారు గొప్పవారు అయ్యారు అని వ్యాఖ్యానించారు.
తప్పకుండా అణిచివేయబడ్డ తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకమయ్యే సందర్భం వచ్చిందని పేర్కొన్న ఈటల, తాను ఇప్పుడు వెళ్తున్నానని తనతో పాటు ఎంతో మంది వెంటవస్తారని స్పష్టం చేశారు. చాలా మంది శరీరం టీఆర్ఎస్ లోనే ఉన్నా, వారి మనసు తనతోనే ఉందని ఈటల హింట్ ఇచ్చారు.
మొత్తానికి, టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేంధర్ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇటీవలే ఆయన దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈటల రాజేంధర్ బీజేపీలో చేరుతారని సమాచారం.