New Delhi, January 24: రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి (Farmers Tractor Rally) ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు దేశ రాజధాని మూడు సరిహద్దుల్లో బ్యారికేడ్లు తొలగించి, మంగళవారం నాటి ర్యాలీకి మార్గం సుగమం చేశారు. కాగా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ల పరేడ్ (Tractor Rally on R-Day) ద్వారా తమ నిరసన తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అయితే, ఇందుకు తొలుత ఇందుకు నిరాకరించిన పోలీసులు (Delhi Police) ట్రాక్టర్ల సంఖ్యపై పరిమితి విధించాలని భావించారు.
శనివారం పోలీసులతో భేటీ తర్వాత రైతు నాయకుడు అభిమన్యు కొహర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 100 కి.మీ. పరిధిలో ర్యాలీ నిర్వహించడానికి అనుమతి వచ్చినట్లు వెల్లడించారు. ఘాజీపూర్, సింఘు, టిక్రి బార్డర్ల నుంచి ట్రాక్టర్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది’ అని అన్నారు. ట్రాక్టర్ ర్యాలీలో వేలాది రైతులు పాల్గొంటారని మరో రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చదుని చెప్పారు. బారికేడ్లు తొలగించి ట్రాక్టర్ ర్యాలీతో ఢిల్లీలోకి ఎంటర్ అవుతామన్నారు. అయితే ఢిల్లీ పోలీసులు రూట్స్ మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ రూట్లో ట్రాకర్ల ర్యాలీ నిర్వహించాలనే దానిపై నేడు క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి ఇవ్వరాదని, హింసాత్మకంగా మారే చాన్స్ ఉందని కొందరు మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశా రు. అయితే తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తామని, ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరారు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ బార్డర్లలో దాదాపు 2 నెలలుగా పంజాబ్, హర్యానా, యూపీ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. శుక్రవారం కేంద్రం, రైతుల మధ్య జరిగిన 11 దఫా చర్చలు ఫెయిల్ అయ్యాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టడంతో చర్చలు ఓ కొలిక్కి రాలేదు.
ట్రాక్టర్ ర్యాలీలో అల్లర్లు సృష్టించాలని, నలుగురు రైతు నాయకులను చంపాలని కుట్ర జరుగుతోందని రైతు సంఘాలు ఆరోపించాయి. సింఘు బార్డర్ లో అనుమానితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. రైతు నాయకుడు కుల్వంత్ సింగ్ మాట్లాడుతూ.. అగ్రి చట్టాలపై రైతులు ఆందోళనను అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రెస్మీట్లో నిందితుడు కూడా కుట్ర ఆరోపణలను అంగీకరించాడు.
Today farmers staged a 'rehearsal' tractor parade around Delhi ahead of 26 January. In video, women taking charge of the rally.
Video- @Bkuektaugrahan #TractorMarchDelhi #TractorRally #TractorToTwitter pic.twitter.com/DQARzzuYDn
— Shivangi Saxena (@shivangi441) January 7, 2021
రైతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొననున్నారు. ట్రాక్టర్ల ర్యాలీ కోసం మహిళా రైతులు కూడా ఇప్పటికే డ్రైవింగ్ మెళకువలు నేర్చుకున్నారు. శాంతియుతంగా నిర్వహించనున్న ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కాగా ఢిల్లీ పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వంలో చర్చలు మరోసారి విఫలమైన నేపథ్యంలో జనవరి 26 తర్వాత భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు సమావేశం అనంతరం తెలిపారు.