New Delhi, January 20: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను అనేక ప్రాంతాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ నెలలుగా రైతులు చలిని, ఎండను లెక్కచేయకుండా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య బుధవారం పదో విడత చర్చలు (Farmers-Government Meet) జరిగాయి. ఐదు గంటలపాటు రైతు నాయకులతో కేంద్రం సుదీర్ఘంగా చర్చించింది.
ఈ సమావేశంలో వివాదాస్పద వ్యవసాయ చట్టాలను (Farm Laws) మూడింటి అమలును 18 నెలల పాటు నిలిపివేయనున్నట్లు రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. ఏడాదిన్నర పాటు చట్టం అమలును నిలిపి ఉంచేందుకు సిద్ధమని, ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో రైతు ప్రతినిధులు విభేదించారు. సాగు చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవాలని పునరుద్ఘాటించారు.
అదేవిధంగా చట్టాలపై చర్చించేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. కమిటీ నివేదిక వచ్చేదాక చట్టాల అమలును (Implementation of 3 Farm Laws) నిరవధికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అయితే రైతు నాయకులు ఈ ప్రతిపాదనను వెంటనే అంగీకరించలేదు. అంతర్గత సంప్రదింపుల అనంతరం తమ అభిప్రాయం వెల్లడిస్తామని తెలిపారు. జనవరి 22వ తేదీన మరోమారు చర్చలు జరగనున్నాయి.
సమావేశానంతరం రైతు ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో అఫిడవిట్ సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తమకు చర్చల్లో తెలియజేసిందని, ఇందుకోసం ఏడాదిన్నర పాటు చట్టాల అమలును నిలిపి ఉంచుతామని చెప్పిందని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా వివరించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), మూడు చట్టాలపై కమిటీ వేస్తామని, కమిటీ సిఫారసులు అమలు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పిందన్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనలపై గురువారంనాడు తాము సమావేశమై చర్చిస్తామని హన్నన్ మొల్లా తెలిపారు. కాగా, మరో రైతు ప్రతినిధి మాట్లాడుతూ, ఏడాదన్నర పాటు చట్టాలను సస్పెండ్ చేసేందుకు సిద్ధమని కేంద్ర ప్రతినిధులు చెప్పారని, అయితే చట్టాలను సస్పెండ్ చేయడానికి ఒప్పుకునేది లేదని, చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు ప్రతినిధులు విస్పష్టంగా చెప్పారని తెలిపారు.
రైతుల సంఘాల ప్రతినిధి కవిత కూరగంటి మాట్లాడుతూ.. వివాదాస్పదంగా మారిన చట్టాలను ఒకటి లేదా రెండు సంవత్సరాలు పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు తెలిపారు. వ్యవసాయ చట్టాలను ఏడాది, ఏడాదిన్నర నిలుపుదల చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. తమ మాట మీద నమ్మకం లేకుండా సుప్రీంలో అండర్ టేకింగ్ ఇస్తామని చెప్పింది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించింది.
కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని చెప్పింది.కేంద్రం ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు రేపు సింఘు బోర్డర్ వద్ద సమావేశమై చర్చించుకుంటాం. ప్రభుత్వ ప్రతిపాదన రైతు ప్రయోజనాలు కాపాడేలా ఉందా లేదా అన్నది చర్చిస్తాం. తదుపరి నిర్ణయాన్ని ఈనెల 22న జరిగే భేటీలో కేంద్రానికి తెలియజేస్తామన్నారు.