Farmers' protest in Delhi | (Photo Credits: PTI)

New Delhi, January 12: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై (Farm Laws Row) సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఈ సందర్భంగా పేర్కొంది.

తాము ఏర్పాటు చేయ‌బోయే క‌మిటీకి రైతులు స‌హ‌క‌రించాల‌ని కోర్టు చెప్పింది. అన్ని రైతు సంఘాల నుంచి క‌మిటీ అభిప్రాయాల‌ను సేక‌రించాల‌ని చీఫ్ జ‌స్టిస్ బోబ్డే తెలిపారు. న్యాయ ప్ర‌క్రియ ప‌ట్ల రైతు సంఘాలు విశ్వ‌స‌నీయత‌ చూపాల‌న్నారు. రైతులు స‌హ‌క‌రించాల‌ని, ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డ‌మే త‌మ ఉద్దేశం అని సీజే అన్నారు. ఒక‌వేళ స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌నుకుంటే, అప్పుడు కోర్టు జోక్యం అవ‌స‌ర‌మ‌ని లేదంటే మీరు ఆందోళ‌న కొన‌సాగించ‌వ‌చ్చు అని సీజే అన్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల అంశంపై విచార‌ణ జ‌రిగిన స‌మ‌యంలో పిటీషన‌ర్ల త‌ర‌పున ఎంఎల్ శ‌ర్మ మాట్లాడారు. ప్ర‌ధాని మోదీ రైతుల‌ను ఒకేసారి క‌లిసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌ధాని మాత్రమే నిర్ణ‌యం తీసుకోగ‌ల‌ర‌న్నారు.

కొత్త చట్టాలు మీరు నిలిపివేస్తారా..మమ్మల్ని నిలిపివేయమంటారా ? కేంద్రంపై అసహనం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం, రైతుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చురక

భూపేందర్‌ సింగ్‌‌ మాన్‌(బీకేయూ), ప్రమోద్‌ కుమార్‌ జోషి(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), అశోక్‌ గులాటీ(వ్యవసాయ శాస్త్రవేత్త), అనిల్‌ ఘావంత్‌(షెట్కారీ సంఘటన)ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాగా కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులతో ( Farmers’ Protest) కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల మధ్య చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని వ్యాఖ్యానించింది. అవసరమైతే ఈ చట్టాల అమలుపై స్టే విధిస్తామన్న న్యాయస్థానం.. మంగళవారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

అదే విధంగా కమిటీని నియమించే అధికారం తమకు ఉందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా.. ‘‘అందరి కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. మాకు నివేదిక సమర్పించేందుకే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. రైతు సంఘాలు సహకరించాలి. సమస్య పరిష్కారం కోసం ఇరుపక్షాలు కమిటీని సంప్రదించాలి. కమిటీని నియమించడంతో పాటుగా.. చట్టాలను నిలిపివేసే అధికారం కూడా మాకు ఉంది. అయితే ఇప్పుడు స్టే విధించామే తప్ప.. చట్టాలను నిరవధికంగా నిలిపివేయబోవటం లేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం. ఒకవేళ రైతు సంఘాలు కమిటీకి సహకరించకపోతే.. ప్రధానిని ఏదైనా చెయ్యమని మేం అడగలేం కదా’’అని సర్వోన్నత న్యాయస్తానం పేర్కొంది.

రైతు సంఘాల‌తో ఇద్ద‌రు కేంద్ర మంత్రులు చ‌ర్చించిన‌ట్లు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ హారీశ్ సాల్వే తెలిపారు. క‌మిటీ ఏర్పాటు ప్ర‌క్రియ‌ను సాల్వే స్వాగ‌తించారు. రాజకీయ ల‌బ్ది కోసం న్యాయ విధానం సాగ‌వ‌ద్ద‌న్నారు. కేవ‌లం ఉద్రిక్త‌త‌ను త‌గ్గించేందుకు, ఉత్సాహాన్ని నింపేందుకు చ‌ట్టాల‌పై స‌స్పెన్ష‌న్ విధిస్తున్న‌ట్లు హ‌రీశ్ సాల్వే తెలిపారు.

కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు ధ‌ర్నా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో 8 రౌండ్ల చ‌ర్చ‌లు కూడా సాగాయి. కానీ ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొన‌డంతో ఆ అంశంలో సుప్రీం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. సుప్రీం ఆదేశించినా.. తాము మాత్రం నిర‌స‌న ప్ర‌దేశాల‌ను వ‌దిలి వెళ్ల‌మ‌ని రైతులు అన్నారు. గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వ రోజున ట్రాక్ట‌ర్ ర్యాలీ ఉంటుంద‌ని రైతులు పేర్కొన్నారు.