File Image of TS RTC JAC leader Ashwatthama Reddy.

Hyderabad, November 7:  ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) నేపథ్యంలో హైకోర్టులో గురువారం వాదనలు ముగిసిన అనంతరం టీఎస్ ఆర్టీసీ జేఏసీ  కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి  (Ashwatthama Reddy) స్పందించారు.

ఈనెల 11లోపు తమతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచిందింది. కాబట్టి సీఎం కేసీఆర్ తమను చర్చలకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. అధికారులతో 9 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపేకంటే, ఆర్టీసీ ఐకాస నేతలతో 90 నిమిషాలు చర్చిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. హైకోర్టులో నేడు విచారణ ఉన్న సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులతో 9 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి అశ్వత్థామ రెడ్డి ఇలా వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి, ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఆర్టీసీ పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం సమర్పించిన నివేదికలను హైకోర్ట్ తీవ్రంగా పరిగణించింది. హైకోర్టును కూడా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఐఏఎస్ అధికారులు కూడా ఈ స్థాయిలో అబద్ధాలు చెప్పటాన్ని హైకోర్ట్ తీవ్రంగా తప్పు పట్టిందని అశ్వత్థామ రెడ్డి వివరించారు. కాబట్టి సీఎం దయచేసి ఈనెల 11 లోపు తమను చర్చలకు పిలవాల్సిందిగా కోరారు.

ఇక, డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు తమ సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు పట్టు విడవకుండా మరింత ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈనెల 9వ తేదీన హైదరాబాద్, ట్యాంక్ బండ్ వద్ద తాము నిర్వహించ తలపెట్టిన మిలియన్ మార్చ్ (RTC Million March) కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ పోరాటానికి మద్ధతు తెలపాలని అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి చేశారు.