Mumbai, November 27: మహారాష్ట్ర (Maharashtra) నూతన ముఖ్యమంత్రి-నియమించబడిన ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కాంగ్రెస్‌లతో జతకట్టి శివసేన ప్రభుత్వాన్ని (Shiv Sena Government) ఏర్పాటు చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం 6.40 గంటలకు ముంబైలోని దాదర్ ప్రాంతంలో గల ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్కులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సహా దేశవ్యాప్తంగా వివిధ పార్టీల రాజకీయ నేతలందరికీ ఆహ్వానం పంపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి కూడా ఆహ్వానాన్ని పంపారు.
గురువారం జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరవుతున్నట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ హాజరవుతారా? లేదా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ తెలిపారు
బుధవారం లోక్‌సభలో శివసేన ఎంపి వినాయక్ రౌత్ మాట్లాడుతూ మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను కూడా రేపు ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లుగా వెల్లడించారు.
మరి ఈ కార్యక్రమానికి శివసేన తరఫున ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తారా? అని పాత్రికేయులు అడిగినపుడు, శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ బదులిస్తూ.. "మేము అందరినీ ఆహ్వానిస్తాము, అమిత్ షాను కూడా ఆహ్వానిస్తాము." అని స్పష్టం చేశారు. అయితే వారు హాజరవుతారా? లేదా ? అన్నదానికి మాత్రం సమాధానమ్ ఇవ్వలేదు.
ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించబడిన అతిథుల జాబితా
సోనియా గాంధీ
రాజ్ ఠాక్రే
అరవింద్ కేజ్రీవాల్
మమతా బెనర్జీ
ఎంకే స్టాలిన్
అఖిలేష్ యాదవ్
అశోక్ గెహ్లోట్
కమల్ నాథ్
సచిన్ పైలట్
భూపేష్ బాగెల్
గురువారం జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని అగ్రశ్రేణి రాజకీయ నేతలు తరలి వస్తుండటంతో శివాజీ పార్క్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేదిక అంటే ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా చెప్తారు. ప్రతీ ఏడాది శివసేన అధ్వర్యంలో శివాజీ పార్కులోనే నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు ఇదే వేదిక నుంచి ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర 17 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో శివసేన తరఫున ముఖ్యమంత్రి కాబోతున్న తొలి వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే కావడం విశేషం.