Union Home Minister Amit Shah | File Image | (Photo Credits: IANS)

Nirmal, September 17: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటిస్తున్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో  అమిత్ షా ప్రసంగించనున్నారని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది.  'తెలంగాణ విమోచన దినోత్సవం' సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అమిత్ షా మొదట మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకొని, అక్కడ్నించి నిర్మల్‌ చేరుకుంటారని సమాచారం. నిర్మల్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం, అమిత్ షా మధ్యాహ్నం 3 గంటల సమయంలో సభా ప్రాంతానికి చేరుకొని ప్రసంగిచనున్నట్లు తెలుస్తుంది.

అమిత్ షా సభ కోసం నిర్మల్ లోని క్రషర్ గ్రౌండ్ ప్రాంతంలో ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ 'వెయ్యి ఊడల మర్రి' గా పిలవబడే ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది, కాలక్రమంలో గాలివానకు అది కూలిపోయింది. అయితే ఆ వెయ్యి ఊడలమర్రికి తెలంగాణ స్వేచ్ఛా స్వాంతత్య్రాల కోసం పోరాడిన రాంజీగోండును మరియు ఆయన వెయ్యి మంది సైన్యాన్ని బ్రిటీష్ పాలకులు ఉరితీశారు. అయితే రాంజీగోండు చేసిన పోరాటం అద్భుతం, కొమరం భీంకు కూడా ఆయనే స్పూర్థి. అయినప్పటికీ ఆయన గురించి ఈతరం పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం వెలుగులోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఓ చిన్న స్మారక స్థూపం మాత్రమే ఉంది. ఇప్పుడు మళ్లీ అమిత్ షా రాకతో చరిత్ర గురించి కొంత తెలుసుకునే అవకాశం ఏర్పడింది.

నిజానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతేడాదే ఈ సెప్టెంబర్ 17న తెలంగాణలో పర్యాటించాల్సి ఉంది అయితే కరోనా నేపథ్యంలో అప్పుడు రద్దు అయింది. ఇప్పుడు మళ్లీ ఇదే రోజున షా పర్యటన ఖరారైంది. మరి ఏంటీ ఈరోజుకున్న ప్రత్యకత?సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనేది భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. రెండు దశాబ్దాలుగా ఈ డిమాండ్ పెండింగ్ లోనే ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17న తమ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తూ వస్తుంది. అయితే అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకుంది.

భారత దేశానికి 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటికీ కూడా కొన్ని రాజ్యాలు స్వతంత్రంగానే కొనసాగాయి. జమ్మూ కాశ్మీర్ కూడా స్వతంత్రంగానే ఉండేది. అందుకే అప్పట్నించే పాకిస్థాన్ ఆ రాష్ట్రం తమది అంటూ నిరంతర యుద్ధం చేస్తూ వస్తుంది. ఆ మంట ఇప్పటికీ సజీవంగానే ఉంది. అలాగే, 1948 చివరి వరకు కూడా భారత దేశంతో సంబంధం లేకుండా నైజాం అసఫ్ జాహీల పాలనలో హైదరాబాద్ ఒక అతి పెద్ద రాజ్యంగా కొనసాగింది. తెలంగాణ ప్రాంతంతో పాటు, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, కర్ణాటకలోని నార్త్-ఈస్ట్ ప్రాంతం కలిపి హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. కర్ణాటక నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని 'హైదరాబాద్ కర్ణాటక' (2020లో కళ్యాణ కర్ణాటక పేరు మార్చబడింది) పేరుతోనే పిలుస్తారు.

ఆనాటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయి పటేల్ జాతీయ సమైక్యత సాధించటం కోసం సమాఖ్య భారతదేశాన్ని నిర్మించటం కోసం స్వాతంత్య్రం తర్వాత కూడా విడిగా ఉన్న రాజ్యాలన్నింటినీ భారతదేశంలో విలీనం చేస్తూపోయారు. అందులో భాగంగానే హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యను చేపట్టడంతో హైదరాబాద్ సైన్యం, భారత సైన్యానికి లొంగిపోయింది. ఆ నాటి హైదరాబాద్ రాజు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ను భారతదేశంలో విలీనంలో చేయటానికి అంగీకరించారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ చరిత్రలో, భారత దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

ఇక, ప్రస్తుత విషయానికి వస్తే, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవం అధికారికంగా జరుపుకోవాలనే డిమాండ్ తో ఈ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనం పొందే దిశగా ఆ పార్టీ రాష్ట్ర క్యాడర్ అడుగులు వేస్తుంది. ఆనాటి నిజాం సైన్యం మరియు 'రజాకర్లు' గా పిలువబడే అతడి ప్రైవేట్ మిలీటరీ దళం ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని, స్వాతంత్య్ర పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారని బీజేపీ నాయకుల చేసే ఆరోపణ. అయితే టీఆర్ఎస్ పార్టీ తన మిత్రపక్షం ఎంఐఎం పార్టీ కోసం విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని వాదిస్తోంది.

విమోచనను ముస్లిం వ్యతిరేక చర్యగా చూపుతూ రాజకీయ లబ్ది పొందాలనేది బీజీపీ ఆలోచన అని టీఆర్ఎస్ వాదిస్తోంది. అలా ఈ రెండు పార్టీలు 'తెలంగాణ విమోచన దినోత్సవం' పై రాజకీయ పోరు చేస్తున్నాయి.

నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణం చాలా సున్నితమైన ప్రాంతం. అక్కడ బీజేపీ- ఎంఐఎం మధ్య జరుగుతున్న రాజకీయ, మతపరమైన పోరు జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా తన పర్యటనను ఈ ప్రత్యేకమైన రోజున, ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో ఎంచుకోవడం ద్వారా తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా అడుగులేస్తుందని స్పష్టమవుతోంది.