Union Minister and BJP leader Gajendra Singh Shekhawat (Photo Credits: PTI)

Jaipur, July 20: రాజస్థాన్ రాజకీయాలు (Rajasthan Political Crisis) అణుక్షణం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రాజస్తాన్‌లో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు (Gajendra Singh Shekhawat) సంబంధం ఉందని కాంగ్రెస్‌ (Congress) ఆరోపిస్తోంది.

తాజాగా కేంద్ర మంత్రికి రాజస్థాన్ స్పెషల్ గ్రూప్ ఆపరేషన్స్ నోటీసులు పంపించింది. ఈ విషయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. బయటకు వచ్చిన వీడియోలో వాయిస్ తనది కాదని తెలిపారు. రంగంలోకి ప్రియాంకా గాంధీ, రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధిష్టానం ముందు 3 డిమాండ్లను ఉంచిన సచిన్‌ పైలట్‌, విక్టరీ సింబల్ చూపిన అశోక్ గెహ్లాట్

దీనిపై షకావత్‌ స్పందిస్తూ నేను ఈ విషయంలో ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఆడియోలో ఉన్నది నా గొంతు కాదు. నన్ను ప్రశ్నించడానికి రమ్మంటే తప్పకుండా వెళతాను అని షకావత్‌ తెలిపారు. కాగా రాజస్థాన్‌కు చెందిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో డబ్బుల విషయం గురించి మాట్లాడుతున్న ఆడియో టేప్‌లు  సోషల్‌మీడియాలో ఈ మధ్య చక్కర్లు కొట్టిన సంగతి విదితమే.

కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి వీటి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గజేంద్ర సింగ్‌తో పాటు ఆయనతో మాట్లాడినట్లు ఆరోపణులన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్దర్‌షహర్, భన్వర్ లాల్ శర్మతోపాటు సంజయ్ జైన్ అనే వ్యక్తిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) పోలీసులు కేసు నమోదు చేశారు. జైన్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు ఆడియో టేపుల వ్యవహారంపై ఆయనను ప్రశ్నించారు.

కాగా, ఆ టేపులో ఉన్న సంభాషణలు తమవి కావని, అవి నకిలీవని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి వారి గొంతు నమూనాలు సేకరించేందుకు రాజస్థాన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ టీమ్‌లో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు షెకావత్ ఫోన్లో చేసిన సంభాషణను పేర్కొంటూ... ప్రభుత్వం కూల్చడానికి చేసిన కుట్రను ఆయన వర్ణించారు.

ఈ టేపులను ఆధారంగా చేసుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించామని ప్రకటించారు. మరోవైపు కేంద్ర మంత్రి షెకావత్‌పై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ ను కూడా ఆయన పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన బీజేపీ తమ పార్టీలోని వివాదాలను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ నేతలపై (BJP Leafders) ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఫోన్‌ కాల్స్‌ను ట్రాప్‌ చేస్తున్నందుకు కాంగ్రెస్‌ పార్టీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ ఆడియో టేపులకు సంబంధించి విచారణ జరిపాలని సీఎం ఆశోక్‌ గ్లెహాట్‌ పోలీసులను ఆదేశించారు.

ఇదిలా ఉంటే బలనిరూపణకు సిద్ధమని సీఎం అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రకటించారు. సచిన్‌ పైలట్‌ సహా.. 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వేటు వేశాక.. అసెంబ్లీని సమావేశపరిచి, బలపరీక్షను ఎదుర్కోవాలని నిర్ణయించారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో.. 10 మంది మద్దతునివ్వడం.. బీటీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు మద్దతు లేఖలివ్వడం.. సీపీఎం, ఆర్‌ఎల్డీకి చెందిన చెరో ఎమ్మెల్యే బయటి నుంచి మద్దతుకు సిద్ధమవ్వడంతో.. గెహ్లోత్‌ సర్కారు గండం నుంచి గట్టెక్కిందనే వార్తలు వస్తున్నాయి.