Lucknow, Jan 12: యూపీలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అక్కడ రాజకీయం మరింతగా వేడెక్కింది. వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh Assembly Elections 2022) సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లోకి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ ( Sharad Pawar) వ్యాఖ్యానించారు. యూపీలో మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారన్నారు. యూపీ మంత్రి మౌర్య ఎస్పీలోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎస్పీతో కలసి బరిలోకి దిగుతామని పవార్ ప్రకటించారు.
80 శాతానికి, 20 శాతానికి మధ్య యుద్ధం’ అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను పవార్ తప్పుబట్టారు. యూపీ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని పోల్చి చూపుతూ యోగి ఇలా మతవిద్వేషం రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారని వార్తలొచ్చిన నేపథ్యంలో పవార్ స్పందించారు. గోవాలో భావ సారుప్యత ఉన్న పార్టీలతో కలసి బరిలోకి దిగుతామని,కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లతో చర్చలు కొనసాగుతున్నట్లు పవార్ చెప్పారు
సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న కీలక వేళ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేసి, సంచలన సృష్టించారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆనందీబేన్ పటేల్‌కు పంపించారు. 2017 ఎన్నికల కంటే ముందే మౌర్య సమాజ్‌వాదీని వీడి, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత మాయావతి కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ సమాజ్‌వాదీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన మౌర్య.. ఆ వర్గంపై మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు తాజాగా ఆయన ఎస్పీలో చేరారు.
భర్త అయినా సరే, భార్యకు శృంగారంలో ఇష్టం లేకుంటే బలవంతం చేయరాదు, కీలక వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు
ఇక తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే అవరాత్ సింగ్ భదానా బీజేపీ పార్టీని వీడి రాష్ట్రీయ లోక్ దల్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఆర్ఎల్ డీ చీఫ్ జయంత్ చౌదరి ట్విట్టర్ ద్వారా తెలిపారు. అవతార్ భదానా ముజఫర్ నగర్ జిల్లాలోని మీర్పూర్ ఎమ్మెల్యే. 2017లో బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయలేదు. సభ్యత్వం రద్దు కాకపోవడంతో ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. స్వామి ప్రసాద్ రాజీనామా తర్వాత నిన్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్ఠానం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించి బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తోంది.