GHMC Mayor: గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల్ విజయ లక్ష్మీ ఎన్నిక, ఫలించిన టీఆర్ఎస్ వ్యూహం, అవలీలగా మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పీఠాలు కైవసం
GHMC Mayor Vijayalakshmi Gadwal | Photo: FB

Hyderabad, February 11: గత కొన్ని రోజులుగా గ్రేటర్ మేయర్ ఎవరనే ఉత్కంఠపై నేటితో తెరపడింది. గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ (జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేట‌ర్, సీనియర్ టీఆర్ఎస్ నేత కేశవ రావు కుమార్తె గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. అలాగే డిప్యూటీ మేయ‌ర్‌గా టీఆర్ఎస్ తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త రెడ్డి ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి గురువారం అధికారికంగా ప్ర‌క‌టించారు.

మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ తరఫున విజయలక్ష్మీ, బీజేపీ తరఫున ఆర్కె పురం కార్పొరేటర్ రాధా రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం ఎన్నికల అధికారి శ్వేత మహంతి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో ఎంఐఎం కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే తమ మద్ధతు ప్రకటించారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

అటు డిప్యూటి మేయర్ పదవి కోసం కూడా టీఆర్‌ఎస్‌ నుంచి ఎం. శ్రీలత రెడ్డి, బీజేపి నుంచి శంకర్ యాదవ్‌ నామినేషన్ వేయగా, ఓటింగ్ తర్వాత శ్రీలత రెడ్డి హైదరాబాద్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు.

డిసెంబర్ లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ దక్కలేదు. మొత్తం 150 డివిజన్లుండే గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్లో టీఆర్ఎస్ 56 డివిజన్లను కైవసం చేసుకోగా, బిజెపి 48 డివిజన్లను, ఎంఐఎం 44 డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లతో చతికిలపడింది. గురువారం మేయర్ కోసం జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మద్ధతుతో టీఆర్ఎస్ పార్టీ అవలీలగా జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంది.