New Delhi, March 3: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్సే తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, ఒకవేళ రానున్న ఎన్నికల్లో (West Bengal Assembly Elections 2021) బీజేపీ కనుక బెంగాల్‌లో అధికారంలోకి వస్తే నేను నా వృత్తి నుంచి పూర్తిగా వైదొలుగుతానని తెలిపారు. బీజేపీ 100 సీట్లను క్రాస్ చేస్తే ఈ వృత్తి వదిలి వేరే వృత్తిలోకి వెళ్లిపోతానని ఆయన (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు
ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...‘‘వంద సీట్ల కంటే బీజేపీ (BJP) అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా. నా సంస్థను కూడా మూసేస్తా. ఈ వృత్తి మాత్రం చేయను. పూర్తి భిన్నమైన వృత్తిని చేపడతా. ఈ రోజు ఉన్నట్టు ఉండను. మరోసారి రాజకీయ ప్రచార వేదికలపై మీకు నేను కనిపించను.’’ అని ఎన్నికల వ్యూహకర్త వ్యాఖ్యానించారు.
కాగా యూపీలో తమ పాచికలు పారలేదని, తమకు స్వేచ్ఛ కల్పించలేదని.. కానీ బెంగాల్‌లో అలా లేదని, పూర్తి స్వేచ్ఛనిచ్చారని సంతృప్తి వ్యక్తం చేశారు. తృణమూల్ తనంతట తాను బలహీనపరుచుకుంటే తప్ప... బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి ఉండదన్నారు. అయితే అధికార తృణమూల్‌లో అంతర్గత వైరుధ్యాలు పుష్కలంగా ఉన్నాయని, రాజకీయంగా ఆ లొసుగులను బీజేపీ సమర్థంగా వాడుకుంటోందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
తృణమూల్ నుంచి బీజేపీలోకి నేతలు వలసలు వెళ్లడంపై కూడా పీకే మాట్లాడుతూ..అదంతా బీజేపీ వ్యూహంలో భాగమేనని, అనేకానేక కారణాలతో నేతలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ‘‘మీ వ్యవహార శైలి నచ్చకే పార్టీని వీడుతున్నారు’’ అని పీకేను ప్రశ్నించగా.... ‘‘పార్టీ నేతలందర్నీ స్నేహితులుగా మార్చుకోడానికి నేను లేను. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమన్న ధ్యేయంతోనే పనిచేస్తున్నా. ఈ పనిచేస్తున్న సందర్భంలో కొందర్ని పట్టించుకోవడం లేదన్న బాధ వారిలో ఉంది. అది వారిష్టం.’’ అని ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టారు.