Kolakat, April 13: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ, బీజేపీ మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఒకరికొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయాలను మరింతగా వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో (West Bengal Assembly Elections 2021) రెచ్చగొట్టే, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఎన్నికల సంఘం (Election Commission) కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే సీఎం మమతా బెనర్జీపై 24 గంటల ప్రచార నిషేధం విధించిన ఈసీ.. తాజాగా బీజేపీ నేత రాహుల్ సిన్హా ( Rahul Sinha) పై 48 గంటల నిషేధం విధించింది. అటు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్‌కు నోటీసులు జారీ చేసింది. కూచ్ బెహార్ కాల్పుల ఘటనపై వీళ్లు చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది.
ఈ కాల్పుల్లో (Cooch Behar Firing) నలుగురు కాదు 8 మంది చనిపోవాల్సింది అని రాహుల్ సిన్హా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. కేంద్ర బలగాలు దృఢంగా ఉన్నట్టయితే, రిగ్గింగ్‌ను అడ్డుకునే క్రమంలో, నలుగురికంటే ఎక్కువ... అవసరమైతే ఏడు లేదా ఎనిమిది మందిని కాల్చి చంపేవారు...’’ అని వ్యాఖ్యానించారు. దీంతో హార్బా నుంచి పోటీ చేస్తున్న ఆయనపై అధికార తృణమూల్ కాంగ్రెస్, వామ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సిన్హా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... అలాంటి నాయకులపై రాజకీయ నిషేధం విధించాలన్నారు. మరోవైపు కూచ్ బేహార్ కాల్పులపై ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌కి సైతం ఈసీ నోటీసులు జారీ చేసింది. ‘‘ఆకతాయిలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే కూచ్ బేహార్ లాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయి...’’ అంటూ ఘోష్ వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన ఈసీ.. వెంటనే ఆయన ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం వరకూ ఈ నిషేధం విధించారు. రాహుల్ సిన్హా బీజేపీ తరఫున హబ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇక రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10 లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ తృణమూల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తనపై 24 గంటల నిషేధాన్ని నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు.