Kolkata, Feb 14: పశ్చిమ బెంగాల్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (West Bengal Civic Polls) బీజేపీ పార్టీకి మమతాబెనర్జీ భారీ షాక్ ఇచ్చింది. ఈనెల 12న పోలింగ్ జరిగిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లనూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గెలుచుకుంది. విధాన్‌నగర్, అసన్‌సోల్, చందన్‌నగర్, సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్లలో (West Bengal Municipal Election Results 2022 ) టీఎంసీ అభ్యర్ధులు విజయం సాధించారు.
మూడు మున్సిపల్ కార్పొరేషన్లను నిలబెట్టుకోవడంతో పాటు సిలిగురి కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా పాలక టీఎంసీ (TMC) అక్కడ పాగా వేసింది. ఇక విధాన్‌నగర్‌లోని 41 సీట్లకు గాను ఏకంగా 39 స్ధానాలకు టీఎంసీ అభ్యర్ధులు దక్కించుకున్నారు. కాంగ్రెస్ ఓ స్ధానంలో, ఇండిపెండెంట్ మరో స్ధానంలో విజయం సాధించారు. కాగా 2019లో బీజేపీలో చేరేందుకు టీఎంసీని వీడిన మాజీ మేయర్ సవ్యసాచి దత్తా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం తిరిగి సొంతగూటికి చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన టీఎంసీ టిక్కెట్టుపై బరిలో నిలిచి విజయం సాధించారు. ఇక చందన్‌నగర్‌లో మొత్తం 32 స్ధానాలుండగా టీఎంసీ 31 స్ధానాల్లో, సీపీఎం ఓ స్ధానంలో గెలుపొందాయి. ఇక్కడ కాషాయ పార్టీ కనీసం ఖాతా తెరవలేదు.
మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్, భారీ ఎత్తున తరలివచ్చిన ఓటర్లు, మార్చి 10న ఓట్ల లెక్కింపు
అసన్‌సోల్‌లో 106 స్ధానాలకు గాను టీఎంసీ 91 స్ధానాల్లో, బీజేపీ (BJP) ఏడు సీట్లలో, సీపీఎం రెండు, కాంగ్రెస్ మూడు స్ధానాల్లో విజయం సాధించాయి.మూడు స్ధానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో అసన్‌సోల్‌లో టీఎంసీ అభ్యర్ధి సయానీ ఘోష్‌పై బీజేపీ అభ్యర్ధి అగ్నిమిత్ర పౌల్ విజయం సాధించగా స్ధానిక పోరులో కాషాయ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. అసన్‌సోల్ నుంచి బీజేపీ ఎంపీగా రెండు సార్లు ఎన్నికైన బాబుల్ సుప్రియో అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఎంసీలో చేరడంతో ఈ ప్రాంతంలో కాషాయ పార్టీకి భారీ దెబ్బ తగిలింది.
ఇక వామపక్షాలకు పట్టున్న సిలిగురిలో టీఎంసీ జెండా రెపరెపలాడింది. సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఎంసీ 37 స్ధానాలను దక్కించుకోగా, బీజేపీ ఐదు స్ధానాల్లో గెలుపొందింది. సీపీఎం నాలుగు స్ధానాలు, కాంగ్రెస్ ఒక స్ధానంతో సరిపెట్టుకున్నాయి. సిట్టింగ్ లెఫ్ట్‌ఫ్రంట్ మేయర్ అశోక్ భట్టాచార్జీ, శంకర్ ఘోష్ ఓటమి పాలయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్ధుల పట్ల విశ్వాసంతో గెలిపించిన ప్రజలకు సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలిపారు.