![](https://test1.latestly.com/wp-content/uploads/2024/03/1-17-1.jpg?width=380&height=214)
Newdelhi, Feb 8: ఢిల్లీలో కమలం (BJP) వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో (Delhi Assembly Elections) మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించి బీజేపీ వీర విహారం చేస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతుండటం గమనార్హం. ఇక, బీజేపీ నుంచి సీఎం ఎవరవుతారనే విషయంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.
రేసులో ముగ్గురు
ప్రస్తుతం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్ దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉండగా.. ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేశ్ బిధూడీ కూడా సీఎం రేసులో ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఏకంగా బీజేపీ సీఎం అభ్యర్థి రమేశ్ బిధూడీ అని తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే. సాధారణంగా బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో సీఎంతో పాటూ ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించడం పరిపాటిగా వస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్ దేవా, ప్రవేశ్ వర్మ.. ఈ ముగ్గురిలో ఒకరిని ముఖ్యమంత్రిగా మిగిలిన ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
వీళ్లు కూడా
బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా అభ్యర్థి సీఎం అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. సీఎం రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో 1993లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా సీఎంలను మార్చిన క్రమంలో 1998లో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా ఈమే.