Washington DC, January 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump)ఇరాన్‌ను (Iran) హెచ్చరించారు. ఎవరైనా అమెరికన్లను లేదా అమెరికన్ ఆస్తులను(Americans or American assets) తాకినట్లయితే, 52 ఇరానియన్ సైట్‌లను హిట్ చేస్తామని ప్రకటించారు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ దేశ పౌరులపై గానీ, ఆస్తులపై గానీ దాడులు జరిగితే చాలా వేగంగా.. తీవ్రంగా స్పందిస్తామని తెలిపారు.
ఇరాన్‌లోని 52 ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని, ఆ లక్ష్యాల్లో ఇరాన్‌లోని ముఖ్య ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సహా తమను బెదిరించే వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునేంతటి శక్తి అమెరికాకు (America)ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో (Twitter) ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
Here are the tweets by Donald Trump:
Iran is talking very boldly about targeting certain USA assets as revenge for our ridding the world of their terrorist leader who had just killed an American, & badly wounded many others, not to mention all of the people he had killed over his lifetime, including recently....
— Donald J. Trump (@realDonaldTrump) January 4, 2020
....hundreds of Iranian protesters. He was already attacking our Embassy, and preparing for additional hits in other locations. Iran has been nothing but problems for many years. Let this serve as a WARNING that if Iran strikes any Americans, or American assets, we have.....
— Donald J. Trump (@realDonaldTrump) January 4, 2020
ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఒక ఉగ్రవాద నాయకుడిని చంపితే.. ఇరాన్ అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడుతోంది. ఇప్పటికే అతడు(ఖాసీం సులేమాని) మా రాయబార కార్యాలయంపై దాడి చేశాడు. అలాగే తమకు చెందిన ప్రాంతాలపై, ఆస్తులపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. విదేశాల్లోని అమెరికా ప్రజలకు గానీ, ఆస్తులను తాకాలని ఇరాన్ భావిస్తే ఇది వారికి ఒక హెచ్చరిక అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
3వ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా..?
బాగ్దాద్ విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమాని, ఇరాకీ పారా మిలటరీ అధిపతి అబు ముహందిస్ మరణించిన సంగతి తెల్సిందే. సులేమానీని చంపడాన్ని తీవ్రంగా ఖండించిన ఇరాన్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బాగ్దాద్‌లోని బలాడ్ అమెరికా వైమానిక స్థావరంపై(US Embassy in Baghdad) శనివారం రాత్రి రాకెట్ దాడి జరిగింది. అలాగే యూఎస్ స్థావరాలపై దాడి చేసేందుకు ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల వర్గాలు యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ రకమైన హెచ్చరిక చేశారు.
బాగ్దాద్‌లో జరిగిన సులేమానీ శవయాత్రలో పాల్గొన్న వేల మంది ఇరాన్ మద్దతుదారులు ‘అమెరికా ముర్దాబాద్ (అమెరికా నశించాలి)’ అంటూ నినదించారు. అమెరికాను దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోవైపు, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వేల సంఖ్యలో ప్రజలు తమ సైనిక కమాండర్ సులేమానీ మృతికి సంతాపంగా ప్రదర్శన నిర్వహించారు.
వారు అమెరికా, ఇజ్రాయెల్ జాతీయ పతాకాలను దహనం చేశారు. బురఖాలు ధరించిన మహిళలు సులేమానీ, ఇరాన్ నాయకుడు ఖమేనీ చిత్రపటాలు ప్రదర్శించగా, పురుషులు ‘ప్రతీకారం తీర్చుకోవాలి’ అనిరాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
సులేమానీ మృతితో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు ఆవరించాయి. అమెరికాది ‘యుద్ధ చర్యే’నని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి మజీద్ తఖ్త్ రవంచీ పేర్కొన్నారు. కాగా సులేమానీ స్థానంలో ఖుద్స్ దళాల అధిపతిగా నియమితుడైన ఇస్మాయిల్ ఖానీ.. అమెరికాపై ప్రతీకార చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది.
ఇరాక్ పారా మిలిటరీ దళం ఖైస్ అల్ ఖజాలీ నాయకుడు మొఖ్తాదా సదర్ తమ ఫైటర్లను ‘సిద్ధం’గా ఉండాలని సూచించారు. ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న లెబనాన్‌లోని హిజ్బుల్లా దళాలు ‘నేరగాళ్లను శిక్షించి తీరుతాం’ అని హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్.. 3,500 మంది సైనికులను కువైట్‌కు పంపుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న 14 వేల మంది సైనికులకు వీరు సహాయ సహకారాలందిస్తారని పేర్కొంది. ఇరాక్‌లోని అమెరికన్ పౌరులు వెంటనే వెనుకకు వచ్చేయాలని ఇప్పటికే ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు ఇరాక్ దక్షిణాన ఉన్న చమురు క్షేత్రాలలో పనిచేస్తున్న అమెరికన్ సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.
బహ్రెయిన్, నైజీరియా, కువైట్‌లలోని తమ దౌత్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది. అమెరికా దాడితో విధ్వంసకరమైన యుద్ధం మొదలవుతుందని ఇరాక్ తాత్కాలిక ప్రధాని ఆదెల్ అబ్దెల్ మహదీ హెచ్చరించారు. ఇరాక్‌లో అమెరికా దళాల మోహరింపునకు అనుమతినిచ్చే ఒప్పందాలను రద్దు చేయాలని ఇరాన్ అనుకూల గ్రూపులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దీనిపై ఇరాక్ పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.