Sankalp Siddhi Case: సంకల్ప సిద్ధి కేసులో షాకింగ్ నిజాలు బయటకు, ఐదు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా
Police commissioner Kanti Rana Tata (Photo-Video Grab)

Vjy, Nov 29: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘సంకల్ప సిద్ధి’ కేసులో (Sankalp Siddhi Case) ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సంస్థకు చెందిన ఐదు బ్యాం కు ఖాతాలను, 14 ప్రాంతాల్లోని ఆస్తులను, విలువైన డాక్యుమెంట్‌లను సీజ్‌ చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా సోమవారం మీడియాకు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం..‘సంకల్ప సిద్ధి ఈ–కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను గుత్తా వేణుగోపాల్, అతని సోదరుడు గుత్తా కిషోర్‌ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ పేరుతో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి అనుమతి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్, యాప్‌ను రూపొందించారు. ఈ కంపెనీలో కొందరు డైరెక్టర్‌లను చేర్చుకుని చట్టవిరుద్ధంగా మనీ సర్క్యులేషన్‌ స్కీం, మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు (operating money circulation scheme) తెరతీశారు.

ఏపీ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్, 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను నియమించుకుని ఐదు ఆకర్షణీయమైన పథకాలతో ప్రజల నుంచి రూ.170 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ మొత్తంలో కొంత నగదును డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారు. గత 15 రోజులుగా విత్‌డ్రాలు నిలిచిపోవడంతో ఐదుగురు ఫిర్యాదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో విచారణ నిర్వహించాం. ఆర్‌బీఐ, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మోసానికి పాల్పడ్డారని గుర్తించామని సీపీ వెల్లడించారు.

ప్రాథమిక విచారణ అనంతరం కంపెనీ సీఎండీలు గుత్తా వేణుగోపాలకృష్ణ (విజయవాడ), గుత్తా కిషోర్‌ (బళ్లారి, కర్ణాటక), డైరెక్టర్‌లు గంజాల లక్ష్మి, మావూరి వెంకటనాగలక్ష్మి (విజయవాడ), సయ్యద్‌ జాకీర్‌హుస్సేన్‌ (గుంటూరు)ను అరెస్ట్‌ చేశాం. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అరెస్ట్‌ చేసినవారిపై విజయవాడ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం.

నగరి క్రీడా సంబరాల్లో అనుకోని ఘటన.. కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!

వారి నుంచి రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు, 728 గ్రాముల బంగారం, 10.5 కేజీల వెండి, రూ.51 లక్షల నగదు, నాలుగు కంప్యూటర్లు, ఒక ల్యాప్‌టాప్, రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఎంత వసూలు చేశారు, ఎంత మేరకు మోసానికి పాల్పడ్డారనేది పూర్తిస్థాయి దర్యాప్తులో తేలుతుంది. ఆ సంస్థ ఆస్తులు, సీజ్‌ చేసిన బ్యాంకు ఖాతాల్లోని నగదు వివరాలను రాష్ట్ర హోం శాఖకు, న్యాయస్థానానికి తెలియజేస్తామని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.న్యాయస్థానం ఆదేశాల మేరకు మోసపోయిన డిపాజిట్‌దారులకు నగదు చెల్లిస్తాం. ఈ మోసంతో గానీ, సంస్థ నిర్వాహకులతో గానీ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.