New Delhi, May 11: రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే (Sedition Law Put on Hold) విధిస్తున్నట్లు ప్రకటించింది. రాజద్రోహం సెక్షన్‌ను కొనసాగించే విషయంపై పునరాలోచిస్తున్నామని, అందుకు తమకు సమయం కావాలని కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈలోపు రాజద్రోహం సెక్షన్ 124(ఏ) కింద కొత్త కేసులేవీ పెట్టకూడదనే (Registering FIRs Invoking IPC Section 124A) సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
అలాగే... ఇప్పటికే ఈ సెక్షన్ కింద అరెస్టయిన వారి హక్కులను కాపాడేందుకు మార్గదర్శక సూత్రాలను రూపొందించే విషయాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది. రాజద్రోహం కేసులన్నీ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు బుధవారం నాటి తీర్పులో వెల్లడించింది. ఈ క్రమంలోనే రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చని తెలిపింది. రాజద్రోహానికి సంబంధించి పెండింగ్ కేసులు, భవిష్యతులో పెట్టబోయే కేసుల విషయంలో ఏం చేస్తారో బుధవారంలోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించారు. ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చించి బుధవారం కోర్టుకు వెల్లడిస్తామని తుషార్ మెహతా తెలిపారు.
అసని ముప్పు పోకముందే మరో ముప్పు, దూసుకొస్తున్న కరీం సైక్లోన్, హిందూ మహాసముద్రంలో బలపడుతున్న తుఫాన్
తొలుత రాజద్రోహ సెక్షన్ కొనసాగాల్సిందేనని, ఈ అంశంపై 1962లో కేదార్‌నాథ్ సింగ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే అంతిమమని వాదించిన సర్కారు.. ఆ వెంటనే వైఖరిని మార్చుకున్న సంగతి తెలిసిందే. రాజద్రోహంపై పునరాలోచిస్తామని పేర్కొంటూ మరో అఫిడవిట్‌ను దాఖలుచేసింది. కాగా 2014-19 మధ్య రాజద్రోహం సెక్షన్ కింద దేశవ్యాప్తంగా 326 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 6 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి.
రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని పేర్కొన్న సుప్రీం.. సెక్షన్ 124A కింద నమోదైన కేసులన్నింటినీ పునః పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, బ్రిటిష్ వలస కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ (సెక్షన్ 124ఏ) చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?’’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు (Supreme Court Tells Centre) మంగళవారం ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది.
అయితే రాజద్రోహం చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ చట్టాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సుప్రీం నేటి తీర్పులో ప్రకటించింది. ఈ చట్టాన్ని సమీక్షించే వరకూ స్టే విధిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అప్పటివరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది.దేశద్రోహం కేసులను రిజిస్టర్ చేసేందుకు ఎస్పీ ర్యాంక్ అధికారికి బాధ్యతను అప్పగించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కాగా దేశద్రోహ చట్టం కింద సుమారు 13వేల మంది జైలులో ఉన్నట్లు కపిల్ సిబల్ తెలిపారు.