Amaravati, May 11: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను (Cyclone Asani) బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. విశాఖ తీరానికి సమీపించి.. ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించిన తీవ్ర తుపాను మరోసారి దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖ తీరం వైపు వచ్చిన సమయంలో గంటకు 16 కి.మీ. వేగంతో ప్రయాణించి.. దిశ మారిన తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది.
మంగళవారం రాత్రి 11.15 గంటల సమయానికి కాకినాడకు 170 కి.మీ., విశాఖకు 290 కి.మీ., గోపాలపూర్‌కు 530 కి.మీ., పూరీకి 630 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం ఉదయానికి మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తిరిగి సముద్రంలోకి వెళ్తుందని.. అక్కడి నుంచి మరింత బలహీనపడి కాకినాడ మీదుగా విశాఖపట్నం తీరం వైపు వస్తుందని అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయానికి తుపానుగా.. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది.
తుపాను ప్రభావంతో ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సుమారు 25 సెం.మీ. మేర వర్షాలు కురిసే అవకాశం (Andhra Pradesh Coast) ఉందని వెల్లడించింది. బుధ, గురువారాల్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి.
ఇదేం చేపరా బాబోయ్, నరకం నుంచి నేరుగా భూమి మీదకు వచ్చిందా, అంటున్న నెటిజన్లు, చూస్తే ఆశ్చర్యపోతారు..
బుధవారం ఉదయం తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కి.మీ., గరిష్టంగా 75 కి.మీ. వేగంతోనూ మధ్యాహ్న సమయంలో గంటకు 75 నుంచి 85 కిమీ, గరిష్టంగా 95 కి.మీ. వేగంతోనూ బలమైన గాలులు (Widespread Rainfall Likely As Storm ) వీస్తాయి. కాకినాడ, విశాఖపట్నం, భీమిలి, గంగవరం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్–10 (జీడీ–10), మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో జీడీ–8 హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే మూడు రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రెడ్‌అలర్ట్ జారీ చేశారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తుపాను కారణంగా విశాఖ విమానాశ్రయంలో మొత్తం 68 సర్వీసులు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇండిగో విమాన సర్వీసులు 46, ఎయిర్ ఏసియా విమాన సర్వీసులు 4, ఎయిరిండియా విమాన సర్వీసులు 2 రద్దయ్యాయి. స్పైజ్‌జెట్ సర్వీసు కూడా రద్దయ్యింది. బుధవారం కూడా ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మంగళవారం రావాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. 65 మండలాల్లోని 555 గ్రామాల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అన్ని జిల్లాల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లు, 16 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను క్రియాశీలకం చేశారు.
తుపాను ప్రభావంతో 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే పలు రైళ్ల రద్దు అయ్యాయి. విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్- నిడదవోలు, విజయవాడ నర్సాపూర్, నిడదవోలు-భీమవరం జంక్షన్, మచిలీపట్నం-గుడివాడ, భీమవరం జంక్షన్-మచిలీపట్నం, భీమవరం-విజయవాడ, గుంటూర్-నర్సాపూర్, గుడివాడ-మచిలీపట్నం, కాకినాడ పోర్ట్-విజయవాడ మార్గాల్లో వెళ్లే డెము, మెము సర్వీసులు రద్దు అయ్యాయి. నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు (12787)ని షెడ్యూల్‌ని మార్చారు. నర్సాపురం నుంచి బుధవారం 11.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు వెళ్లనుంది. బిలాస్‌పూర్ తిరుపతి, కాకినాడ పోర్ట్-చెంగల్పట్టు రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారిమళ్లించారు.