TS Inter Results: శుక్రవారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు? ఫస్ట్ ఇయర్ మార్కులే సెకండ్ ఇయర్‌కు ప్రదానం, మార్కుల కేటాయింపుపై విధివిధానాలు ఖరారు చేసిన ఇంటర్ బోర్డు
Representational Image (Photo Credits: PTI)

Hyderabad, June 24: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు శుక్రవారం లేదా శనివారం విడుదల చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రేపే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫలితాలు విడుదల అయిన తర్వాత ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ లో చూడవచ్చు,

COVID-19 వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం, విద్యార్థులందరూ ఉతీర్ణత సాధించినట్లుగా ఇదివరకే ప్రకటించింది.

ఇక, సెకండ్ ఇయర్ మార్కుల కేటాయింపుపై ఇంటర్ బోర్డు విధివిధానాలను ఖరారు చేసింది. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా ఫస్ట్ ఇయర్‌లో ఏవైతే మార్కులు పొందారో అవే మార్కులను సెకండ్ ఇయర్‌లోనూ కేటాయించనున్నారు. ఉదాహారణకు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 50 మార్కులు వస్తే, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలోనూ 50 మార్కులే పొందుతారు. మరోవైపు ఫెయిల్ అయిన విద్యార్థులకు పాస్ లెక్కన 35 శాతం మార్కులు కలపనున్నారు. ఇదిలా ఉంటే ప్రాక్టికల్స్ లలో విద్యార్థులందరికీ 100 శాతం మార్కులు లభించనున్నాయి. ఈ విధానం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది.

బుధవారం విడుదల చేసిన ఒక ఉత్తర్వులో,  “ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2020 (సాధారణ, వృత్తి, బ్రిడ్జి కోర్సు) లో సాధారణ విద్యార్థులు పొందిన మార్కులు  రెండవ సంవత్సరంలో ఇవ్వడానికి ప్రాతిపదికగా తీసుకోవాలి.  ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనందున, ప్రాక్టికల్స్ (జనరల్, ఒకేషనల్ మరియు బ్రిడ్జ్ కోర్సు) లో విద్యార్థులకు 100% మార్కులు ఇవ్వబడతాయి.

మొదటి సంవత్సరం సబ్జెక్టులలో ఫెయిల్ అయినప్పటికీ, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ ఇప్పటికే కనీసం 35% ఉత్తీర్ణత మార్కులు మంజూరు చేయబడతాయి. అదేవిధంగా, ప్రైవేట్ అభ్యర్థులకు ఫెయిల్ అయిన సబ్జెక్టులలో కనీస పాస్ మార్కులు ఇవ్వబడతాయి.

ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్, మరియు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన రెండవ సంవత్సరం విద్యార్థులు (రెగ్యులర్ మరియు ప్రైవేట్) కనీసం 35% మార్కులు పొందుతారు. అదేవిధంగా, జనరల్ బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు మరియు జనరల్ హ్యుమానిటీస్ కోర్సులు వంటి అదనపు సబ్జెక్టులకు ‘హాజరు మినహాయింపు’ కేటగిరీలో ఉన్న అభ్యర్థులందరికీ మొదటి సంవత్సరం బ్యాక్‌లాగ్ థియరీ సబ్జెక్టులు, సెకండ్ ఇయర్ సబ్జెక్టులలో 35% మార్కులు లభిస్తాయి.

ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితి అనుకూలంగా మారినప్పుడు మళ్లీ పరీక్షలు నిర్వహించబడతాయి.