File image of TS Minister Puvvada Ajay | Photo: Twitter

Hyderabad, December 15: తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కు కరోనా సోకింది. ‌సోమవారం నిర్వహించిన పరీక్షల్లో మంత్రికి కొవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి అజయ్ కూడా ధృవీకరించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరగానే కోలుకొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన తన అనుచరులకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. తనకు ఫోన్ చేయడానికి గానీ, కలుసుకోవడానికి గానీ ప్రయత్నించవద్దని ఆయన కోరారు.

తనకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంత్రి అజయ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పువ్వాడ సూచించారు.

మంత్రి గత వారం రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనేక శంకుస్థాపనలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. అయితే ఆయన పాల్గొన్న అన్ని కార్యక్రమాలలో మాస్క్ ధరించారు.

మరోవైపు, తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ 2021 జనవరి మధ్య వారాల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.  ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు వేగంగా ఎలా పంపిణీ చేయాలనే దానిపై ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసేలా రాష్ట్ర ఆరోగ్య అధికారులు విస్తృతమైన ప్రణాళికను రూపొందించారు. ప్రణాళిక ప్రకారం, నాలుగు వేర్వేరు వర్గాల కింద ఎంపిక చేయబడిన దాదాపు 70 లక్షల మంది ఒక వారంలో వ్యాక్సిన్ పొందేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.