Ramban Encounter: భారీ దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు, ముగ్గురు టెర్రరిస్టులను లేపేసిన ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు, ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం తరువాత రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో అజిత్ దోవల్
Three Terrorists Killed In Ramban Encounter (Photo-ANI)

Jammu kashmir,September 28: ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగం తర్వాత ఉగ్రమూకలు మరింతగా రెచ్చిపోతున్నారు. కశ్మీర్‌లో రక్తపాతం జరుగుతుందన్న పాక్ పీఎం ఇమ్రాన్‌ ఖాన్ ఆరోపణలను నిజం చేసి అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. మరో పుల్వామా దాడి తప్పదన్న పాక్ పీఎం వార్నింగ్‌ను నిజం చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు రెండు చోట్ల వాహనాలను హైజాక్‌ చేసి దాడులకు ప్రయత్నించారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసింది. ఈ నేపథ్యంలోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కాశ్మీర్ ని సందర్శించారు. అవసరమయితే యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్ ని ముమ్మరం చేయాలని రాష్ట్ర పోలీసులను, భారత జవాన్లను ఆదేశించినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించవచ్ఛునని వార్తలు వినిపిస్తుండటంతో జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు హైటెన్సన్ నెలకొంది.

శనివారం ఉదయం రెండు ఎన్ కౌంటర్లు, గ్రెనేడ్ దాడులతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉలిక్కిపడింది. రంబన్ జిల్లా బాటోట్ లో భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. అక్కడ టెర్రరిస్టులు ఓ ఇంటిలో ప్రవేశించి ఓ వ్యక్తిని బందీగా పట్టుకున్నారని, ఆ ఇంట్లో దాక్కుని కాల్పులకు తెగబడ్డారని తెలిసింది. అటు-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఆపడానికి ప్రయత్నించారు. భారత జవాన్ల దుస్తుల్లో వచ్చిన వీరిని చూసి అనుమానించిన బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్ళిపోయాడు. సమీపంలోని సైనిక చెక్ పోస్టులో సైనికాధికారులకు , పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన జవాన్లు, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించారు. టెర్రరిస్టులు అక్కడ ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించే ముందు వారిపై బాంబులు కూడా విసిరినట్టు తెలుస్తోంది. మరోవైపు నియంత్రణ రేఖ సమీపంలోని గురేజ్ సరిహద్దుల్లో గాందర్ బల్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో ఓ ఉగ్రవాది మరణించాడు. శ్రీనగర్లో కొందరు మిలిటెంట్లు గ్రెనేడ్లు విసిరారని, అయితే ఎవరూ గాయపడలేదని సమాచారం.

ఉగ్రవాదులను అంతం చేసిన ఇండియన్ ఆర్మీ

మూడు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శ్రీనగర్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడి నుంచి జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. జమ్మూ-కిష్టావర్ జాతీయ రహదారిపై ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. గాందర్‌బల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ బలగాలు తనిఖీలు నిర్వహించగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రామ్‌బన్‌ జిల్లాలో బటోత్-దోడా జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని ఉగ్రవాదులు బంధించారు. అయితే భద్రతా బలగాలు ఆ వ్యక్తిని వారి చెర నుంచి విడిపించాయి. ఉగ్రవాదులు విజయ్‌కుమార్‌ అనే ఓ వ్యక్తి ఇంట్లోకి దూరారు. ఉగ్రవాదులు చొరబడ్డ సమయంలో వారి కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరు. ఆ ఇంట్లో నక్కి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా రహదారులపై వాహనాల రాకపోకలను భద్రతా బలగాలు నిలిపివేశాయి.

టెర్రర్ హంట్ ఆపరేషన్ వివరాలను జమ్ము ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకేశ్ సింగ్ మీడియాకు వివరించారు. బటోట్ లో ఉగ్రవేట ముగిసిందన్నారు.

మీడియాతో జమ్ము ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకేశ్ సింగ్ 

ఒక సోల్జర్ చనిపోయాడని.. మరో ఇద్దరు పోలీసులకు బుల్లెట్ గాయాలు తగిలాయని ఆయన చెప్పారు. ఉగ్రవాదులను చంపేయడంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.8గంటల పాటు టెన్షన్ రేపిన ఎన్ కౌంటర్ లో తమ ప్రాణాలకు తెగించి. స్థానికుల ప్రాణాలను సైన్యం కాపాడింది . ఉగ్రవాదులు బంధించిన స్థానికుడిని ప్రాణాలతో కాపాడారు. ముగ్గురు ఉగ్రవాదులను లేపేశారు. ఈ ప్రయత్నంలో ఓ ఆర్మీ జవాన్ అమరుడయ్యారు.