Hyderabad, November 2: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 29వ రోజుకు చేరింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుకూల సంకేతాలు రావడం లేదు. హైకోర్టు (High Court)లో సమ్మెపై వాదోపవాదాలు నడుస్తున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని తెలంగాణా సీఎం కేసీఆర్ (Telangana CM KCR ) చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆర్టీసీ జేఏసీ (RTC JAC ) భవిష్యత్తు కార్యచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సమ్మె (RTC Strike)ను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి (Ashwathama Reddy) ప్రకటించారు. విద్యానగర్‌లోని ఎంప్లాయిస్ యూనియన్‌లో ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలతో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశం ముగిసిన అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలువనున్నట్లు తెలిపారు. కార్మికులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయనతో చర్చిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈనెల 4 లేదా 5వ తేదీలలో అమిత్ షాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది చెల్లుబాటు కాదని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
సమ్మెపై కేసీఆర్ అత్యవసర సమీక్ష
సమ్మెతో ప్రయాణికుల ఇక్కట్లు, బకాయి సొమ్ములపై హైకోర్టులో అసంతృప్తి నేపథ్యంలో ఆర్టీసీపై శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో హైకోర్టు విచారణ, ప్రయాణికుల కోసం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులను ఆరా తీశారు. పదే పదే రివ్యూలు నిర్వహిస్తూ ఆర్టీసీ బకాయిలపై అవగాహన కల్పించినా హైకోర్టులో సమర్ధవంతంగా వాదనలు వినిపించలేకపోవటంపై కేసీఆర్ తప్పుబట్టారు. అధికారుల తీరుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హైకోర్టు ముందు ప్రభుత్వ వాదనలు వినిపించటంలో సరైన వాదనలు వినిపించలేదని సీఎం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న లక్ష్మణ్
ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 29వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై లక్ష్మణ్ (BJP Leader Laxman) కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Home Minister Amit Ahah) ను కూడా ఆయన కలవనున్నారు.
ఆర్టీసీ కార్మికులత ో బీజేపీ నేత లక్ష్మణ్
Visited Khammam Bus Depot & requested RTC Employees not to take any extreme steps & assured #TSRTC Employees that @BJP4Telangana is standing with them #tsrtcstrike pic.twitter.com/hzZ1zOgHzD
— Dr K Laxman (@drlaxmanbjp) November 1, 2019
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. లక్ష్మణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్( Kodandaram) తదితరులు శనివారం ఉదయం ఆయన్ని కలిశారు. ఆర‍్టీసీ కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై లక్ష‍్మణ్‌తో చర్చించారు.
ఆర్టీసీ ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉంది : అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదని తాము ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. అందువల్ల ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జరగదని కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆర్టీసీ, ఐకాస నేతలు, విపక్ష నేతల సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
పలు కీలక నిర్ణయాలు
3న అన్ని డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్ష
5న సడక్ బంద్ రహదారుల దిగ్బంధం
6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు నిరసన
7న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష
8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు
9న ట్యాంక్ బండ్ పై దీక్ష, నిరసన కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.