Happy Holi 2020 Wishes Telugu: వసంత ఋతువు ఆగమనాన్ని సూచించేదే హోళీ లేదా హోలీ పండుగ. హిందువులు ఘనంగా జరుపుకునే పండగల్లో ఇదీ ఒకటి. ఇది రంగుల పండుగ, వసంత కాలంలో అద్భుత దృశ్యంగా కనిపించే ప్రకృతి రమణీయతను వేడుక చేసుకుంటూ, ప్రజలు ప్రకృతిలో మమేకం అనే భావనను ఈ పండగ తెలియజేస్తుంది. ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. ఒక్కో చోట ఒక్కో పేరుతో ఈ పండుగను పిలుస్తారు.
భగవంతుడైన కృష్ణ పరమాత్ముడు కొలువై ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రాలైనటు వంటి మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో హోళీ పండుగ అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటకుల తాకిడితో రద్దీగా ఉంటాయి.
హోలీకి ఒకరోజు ముందు "హోలిక దహన్", తెలుగు రాష్ట్రాల్లో అయితే "కామ దహనం" కార్యక్రమం నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల హోలీ పండగా ఘనంగా నిర్వహించబడుతుంది. కామదహనం వేడుక భోగి పండగను పోలి ఉంటుంది. అయితే సాయంత్రం వేళల్లో కామదహనం జరుగుతుంది. మనలోని పాపాలు, చెడును ఆ కాముడి రూపంలో దహనం చేయడం దీని ఉద్దేశ్యం. కామదహనం చేసే మంటల్లో శనగలు వేసి కాలుస్తారు, కామదహనం పూర్తయిన తర్వాత ఆ బూడిదను, శనగలను ఇంటికి తీసుకొని వెళ్తారు. ఆ బూడిదను నుదిటిపై బొట్టుగా రాసుకొని, శనగలను ప్రసాదంగా తినడం ద్వారా మనలోని పీడలు, చెడు నశింపజేసుకున్నట్లు చెప్తారు.
ఇక కామదహనం తర్వాత రోజును హోలీ పండుగగా జరుపుకుంటారు. హోలీ రోజున ప్రజలు ఆత్మీయంగా ఒకరికొకరు రంగులు పూసుకోవడం, రంగు నీళ్ళను చల్లుకోవడం చేస్తారు. ఇది చాలా ఉల్లాసంగా ఆనందంగా జరుపుకునే కార్యక్రమం. స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా కలిసి రంగులు చల్లుతూ అందరినీ హోలీ పండగలో భాగస్వామ్యం చేసుకుంటూ వెళ్తారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
మరి ఈ ఉల్లాసభరితమైన హోలీ పండుగను జరుపుకోడానికి మీరు సిద్ధమేనా? మీకోసం, మీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ హోలీ శుభాకాంక్షలను అందజేస్తున్నాం. ఇవి మీ ఆత్మీయులకు పంపించి వారికి పండగ శుభాకాంక్షలు తెలపండి, వేడుకను కలిసి జరుపుకునేందుకు వారిని ఆహ్వానించండి. మీరు హోలీ వేడుక జరుపుకుంటున్నట్లు అందరికీ తెలిసేలా ఈ శుభాకాంక్షలను మీ సోషల్ మీడియా ద్వారా పంచుకోండి.
Holi Wishes Telugu: సప్తవర్ణాల శోభితం..
హోళీ పండుగ చేస్తుంది ఈ జగమంతా రంగులమయం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోళీ శుభాకాంక్షలు
Holi Wishes Telugu: వచ్చిందయ్యో హోలీ, ఖుషీ చల్లుకోవాలి
పూసుకున్న రంగులతో ఆనందాలు వెల్లివిరియాలి
మన జీవితాలు రంగులమయం అవ్వాలి
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోళీ శుభాకాంక్షలు
Holi Wishes Telugu: గుప్పిట్లో రంగే కురిసేలే రంగుల జల్లై
పుడమి విరిసేలే సప్తవర్ణాల హరివిల్లై
బుక్కాగులాలు చల్లు, ఈ పండగతో ఆనందాలు వెదజల్లు
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోళీ శుభాకాంక్షలు
Holi Wishes Telugu: రంగురంగులుగా మేఘం కురవనీ ఈనాడు
రంగుల వర్షంలో ఒళ్లంతా తడవనీ నేడు
మనసు నిండేలా.. బ్రతుకు పండేలా..
జరుపుగుందాం ఈ రంగుల పండుగ ఇలా ఎప్పుడూ.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోళీ శుభాకాంక్షలు
Holi Wishes Telugu: అన్ని రంగులు కలగలిసిన ఈ ప్రకృతి ఎందో అందం
అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఈ జగమంతా ఆనందం
ఇదే కదా హోలీ సందేశం, రంగులద్ది చాటుదాం మన సామరస్యం
హోళీ శుభాకాంక్షలు
హోలీ పండగను అందరూ కలిసి ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుపుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అందరికీ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున హోలీ శుభాకాంక్షలు.