![](https://test1.latestly.com/wp-content/uploads/2020/03/Happy-Ugadi-2021-Messages.jpg)
అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం. జన్మం- ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే ఉత్తరాయణ, దక్షిణాయనముల ద్వయం 'యుగం' (సంవత్సరం) అవుతుంది. ఆ విధంగా యుగానికి ఆది యుగాది అయింది. దీనినే సంవత్సరాది అని కూడా పిలుస్తారు. భారతీయ పురాణాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని చెబుతారు.
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని హిందువులు సాంప్రదాయబద్దంగా కొత్త సంవత్సరాన్ని వేడుకగా జరుపుకుంటారు. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.
తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈరోజున పంచాంగ శ్రవణం చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది.
ఈ పండగను కర్ణాటకలో యుగాది, మహారాష్ట్రలో గుడిపాడ్వా, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు అనే పేర్లతో పులుస్తారు. సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గా జరుపుకుంటారు.
చైత్రమాసాన వసంత ఋతువులో కొత్త పూతలతో, కోయిల రాగాలతో ప్రకృతి సోయగాల నడుమ వచ్చే ఉగాది పడంగ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతూ మనస్సులో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనలను నింపుతుంది. జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగిల్చి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఈ ఉగాది.
ఈ శుభ సందర్భాన మీకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ షడ్రుచుల లాంటి శుభాకాంక్షలను గ్రీటింగ్స్ ను ఇక్కడ అందిస్తున్నాం. నేడు విషపుగాలి సోకి అందరూ ఇళ్లకే పరిమితమవుతున్న తరుణంలో ప్రకృతి వరప్రసాదమైన ఉగాది పచ్చడి సేవిస్తూ, శ్రావ్యమైన పంచాగం వింటూ అందరికీ శుభమే కలగాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలను మీ ఆత్మీయులకు పంపేందుకు మీ Facebook Status, WhatsApp messages, Instagram stories లేదా సందేశాలుగా పంపించేందుకు అందిస్తున్నాం.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/03/01.jpg)
Ugadi Shubhaakankshalu: మనిషి జీవితం సకల అనుభూతుల మిశ్రమం,
షడ్రుచుల సమ్మేళంతో ఉగాది పర్వదినం చాటుతుంది ఈ సందేశం.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/03/02.jpg)
Ugadi Shubhaakankshalu: తిమిరాన్ని పారదోలే నూతన ఉషోదయం
కొత్త చిగుళ్లతో, కోకిల రాగాలతో సరికొత్త ఆరంభానికి లభించే సంకేతం
ఉగాది పర్వదినంతో ఆరంభించు నవశకం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/03/03.jpg)
Ugadi Shubhaakankshalu: ప్రకృతిని పులకరింపజేసేదే చైత్రం
జీవితంలో కొత్త ఉత్సాహం నింపుతూ పలకరించేదే ఉగాది పర్వదినం.
షడ్రుచుల సమ్మేళనంలా నిలవాలి మన బంధాలు పదిలంగా కలకాలం.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/03/04.jpg)
Ugadi Shubhaakankshalu:
తీపిలోని ఆనందం, చేదులోని దుఖం, కారంలోని అసహనం
పులుపులోని ఆశ్చర్యం, ఉప్పులోని ఉత్సాహం, వగరులోని పొగరు- సాహసం.
అన్ని రుచులను స్వీకరించినపుడే జీవితానికి ఒక అర్థం.
ఏదేమైనా ముందడుగు వేయమని చెప్పేదే ఉగాది పర్వదినం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/03/05.jpg)
Ugadi Shubhaakankshalu: గుమ్మానికి లేత మామిడి తోరణాలు
గడపకు స్వచ్ఛమైన పసుపు పూతలు
వాకిళ్లకు అలుకుతో పలికే స్వాగతాలు
ప్రకృతి వరప్రసాద షడ్రుచుల స్వీకారాలు
మన సాంప్రదాయాలే తొలగిస్తాయి సమస్త చీడపీడల రోగాలు.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున శ్రీ శార్వారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.