జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. రైతు లేనిదే మనిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తింటున్నామంటే అది రైతు వల్లే. అలాంటి రైతు ఆరు నెలలు కష్టపడినా, శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం తమ పంటను వేస్తూ ఉన్నారు. పదిమందికి అన్నం పెడుతున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. అందుకే డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని (National Farmers Day 2021) జరుపుకొంటున్నారు. భారతదేశం వ్యవసాయ దేశంగా చెబుతారు. నేటికీ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయం లేదా అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు.
ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి తెస్తూనే ఉన్నాయి. దీనికి తోడు ఒక రోజు వర్షాల కోసం.. ఇంకోరోజు విత్తనాల కోసం.. మరో రోజు ఎరువుల కోసం.. మరో సారి బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ రైతు ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇవి భరించలేక చాలామంది భూమి ఉన్నా వ్యవసాయం మానేస్తున్నారు. కొందరు భూమిని కౌలుకు ఇస్తున్నారు. మరికొందరు అప్పుల బాధలు భరించలేక, సరైన సమయంలో రుణమాఫీ కాక ఈ భూమిని వదిలేస్తున్నారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, పూర్తయిన వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ
భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినమైన ఈ రోజు డిసెంబర్ 23న రైతు దినోత్సవం (Kisan Diwas 2021) జరుపుకుంటారు. చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5 వ ప్రధాన మంత్రి. అన్నదాతల ప్రయోజనాల కోసం, వ్యవసాయం కోసం అతను అనేక ముఖ్యమైన పనులు చేసాడు. దేశంలోనే ప్రముఖ రైతు నాయకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. దేశ ప్రధానిగా ఉన్న చౌదరి చరణ్ సింగ్ రైతులు, వ్యవసాయ రంగ అభ్యున్నతిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది.
రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషికి 2001లో భారత ప్రభుత్వం డిసెంబర్ 23ని రైతు దినోత్సవంగా (Farmer's Day 2021) జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున కిసాన్ దివస్‌గా జరుపుకుంటారు. రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.రైతులు ఆయన్ని భారతదేశపు రైతుల విజేతగా కీర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని రైతు కుటుంబంలో డిసెంబర్ 23, 1902 న జన్మించిన చౌదరి చరణ్ సింగ్ గాంధీచే చాలా ప్రభావితమయ్యాడు. దేశం బానిసగా ఉన్నప్పుడు అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. స్వాతంత్య్రానంతరం రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయడం ప్రారంభించారు. అతని రాజకీయాలు ప్రధానంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై దృష్టి సారించాయి. ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ రెండు పర్యాయాలు ఆయన పదవీ కాలం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇదిలావుండగా ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో ప్రధాన భూమిక పోషించి రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. దేశ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ జమీందారీ వ్యవస్థను అంతమొందించేందుకు ఎనలేని కృషి చేశారు.
చరణ్ సింగ్ 1985 నవంబరు 29 న గుండెపోటుకు గురయ్యాడు. అతనికి యు.ఎస్. లోని ఆసుపత్రిలో వైద్యం చేయించినప్పటికీ నయం కాలేదు. 1987 మే 28న వైద్యులు అతనికి శ్వాస ఆడటం లేదని న్యూఢిల్లీ లోని అతని నివాసానికి కబురు అందించారు. తరువాత రోజు ఉదయం 2.35 కు అతను మరణించినట్లు ప్రకటించారు
కిసాన్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారం, రైతుల సమస్యలు, వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు, నూతన సాంకేతికత, పంటల విధానం, సాగులో మార్పులు వంటి అనేక అంశాలపై అర్థవంతమైన చర్చ జరుగుతోంది.
.