Krishna Janmashtami 2020: కృష్ణాష్టమి పండుగ గొప్పతనం ఏమిటి ? కృష్ణ జన్మాష్టమి రోజున ఏం చేయాలి ? శ్రీ కృష్ణ లీలలు గురించి ఎవరికైనా తెలుసా ? గోకులాష్టమి పండుగపై పూర్తి సమాచారం మీకోసం
Shri Krishna Images (Photo Credits: @Itsmereddy_/ @saandilyae/ Twitter)

సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమినే... గోకులాష్టమి (Gokulashtami 2020) అని కూడా అంటారు. భారతదేశం మొత్తం ఈ ప్రత్యేక పండుగను జరుపుకుంటుంది. హిందూ కేలండర్ ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి రోజున ఈ పండుగ (Krishna Janmashtami) జరుపుకుంటారు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం... కృష్ణాష్టమిని (Krishna Janmashtami 2020) ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ భగవానుణ్ని చెప్పుకుంటారు. దృక్‌పంచాంగం ప్రకారం... ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని (Happy Krishna Janmashtami) జరుపుకుంటున్నాం. అంటే 5వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు జన్మించినట్లు ఈ పంచాంగం చెబుతోంది.

శ్రీకృష్ణుడు జననం : శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు (Sri Krishna) జన్మించాడు. కృష్ణాష్టమిని "గోకులాష్టమి", "అష్టమి రోహిణి", "శ్రీకృష్ణ జన్మాష్టమి", "శ్రీకృష్ణ జయంతి", "శ్రీ జయంతి", "సాతం ఆతం", "జన్మాష్టమి" ఉట్ల పండుగ - ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు. కృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారంలో శ్రీకృష్ణుడు ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 2020, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, పూర్తి కథనం మీకోసం

పురాణాల ప్రకారం... మథురను పాలించే కంసుణ్ని చంపేందుకే శ్రీకృష్ణుడు పుట్టాడు. కంసుడి చెల్లెలైన దేవకికి పుట్టాడు బాలగోపాలుడు. కంసుడి స్నేహితుడైన వసుదేవుడికే దేవకిని ఇచ్చి కంసుడు పెళ్లి చేశాడు. ఆ తర్వాత వారికి పుట్టే ఎనిమిదో సంతానం కంసుణ్ని చంపుతుందని ఆకాశవాణి చెప్పడంతో... కంసుడికి ఒళ్లు మండుతుంది. దేవకి, వసుదేవుణ్ని జైల్లో పెట్టి... వారికి పుట్టే పిల్లలందర్నీ చంపుతూ వస్తాడు. ఎనిమిదో సంతానంగా శ్రీకృష్ణుడు (Lord Krishna) పుట్టినప్పుడు వసుదేవుడు ఆ గోపాలుణ్ని బృందావనం తీసుకెళ్లి అక్కడ నందుడు, యశోద దంపతులకు ఇస్తాడు. తిరిగి మధుర వచ్చి తమకు ఎనిమిదో సంతానంగా ఆడపిల్ల పుట్టిందనీ ఆమెను చంపవద్దని కోరతారు. కానీ కంసుడు ఒప్పుకోడు. ఆడపిల్లను చంపేందుకు యత్నిస్తాడు. దాంతో ఆ పాప దుర్గాదేవి అవతారంలో కనిపించి నీ పని అయిపోయినట్లే అని హెచ్చరిస్తుంది. కొన్నేళ్ల తర్వాత కృష్ణుడు పెద్దవాడే మధురకు వచ్చి కంసుణ్ని చంపుతాడు. దాంతో మథుర ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది.

ఈ రోజు కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు.

పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. కృష్ణాష్టమి నాడు ఉపవాస దీక్ష చేసే భక్తులు ఉదయం వేళ పూజలు చేసి సంకల్పం చెప్పుకుంటారు. పంచామృతాలతో శ్రీకృష్ణుడి ప్రతిమను శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు, నగలు, పూలు, పండ్లతో అలంకరిస్తారు. నైవేద్యంగా స్వీట్లు పెడతారు. ఉయ్యాలలో ఉంచి స్వామిని పూజిస్తారు. పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం

ముఖ్యంగా శ్రీకృష్ణుడుకి ఎంతో ఇష్టమైన అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు.శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే 'శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే.. అనే మంత్రాన్ని స్మరిస్తూ ఈ రోజు పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.

శ్రీ కృష్ణ లీలలు

1. కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది. యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది.

కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.

2. ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. "కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి" అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది.

దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తి ప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.