Happy Makar Sankranti 2023 Telugu Wishes: ఊరు-వాడ, చిన్న- పెద్ద అంతా సంతోషాలతో చిందువేసే సరదాల పండగ వచ్చేసింది. కణకణ మండే కొత్త కిరణాల కాంతి సంక్రాంతి పండగ రానే వచ్చింది. సంక్రాంతి అంటే నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. ఆ సంక్రమణాన్నే సంక్రాంతి లేదా మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి, పొంగల్, మాఘి పేరేదైనా అవ్వనీ పండగ ఒకటే, భారతదేశంలో ఒక్కోచోట ఒక్కో పేరుతో ఈ వ్యవసాయ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో హిందువులు, సిక్కులు ప్రముఖంగా జరుపుకునే పండగ ఇది. ఆంధ్రులకు సంక్రాంతి అతిపెద్ద పండుగ కాగా, తెలంగాణలో రెండో అతిపెద్ద పండగ.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఎక్కడెక్కడో ఉండే వారంతా సొంతూళ్లకు చేరడంతో పల్లెటూర్లు నిండుగా కళకళలాడుతున్నాయి. పుణ్యస్నానాలు, భోగి మంటలతో ప్రారంభమై, సంక్రాంతి వెలుగులతో, కమ్మనైన కనుమ వంటలతో ఉత్సవంగా జరిపే సంక్రాంతికి ప్రతీ ఇల్లు పండగ కళను సంతరించుంది. గుమ్మానికి మామిడి తోరణాలు, ముంగిళ్లలో ముచ్చటైన రంగవల్లులు, పండగ పూట డూడూ బసవన్న ఆటలు, హరిదాసు కీర్తనలు, పిండివంటలు లెక్కకు మించి సరదాలు, హద్దుల్లేని ఆనందాలు ఈ సంక్రాంతికే సొంతం. ఇక గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల గురించి చెప్తే మాటలు చాలవు కోడి పందాలు, పేకాట రాయుళ్లతో పండగ శోభ అంతా ఇక్కడే ఉందా అనిపిస్తుంది.
తెలంగాణలో సంక్రాంతి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. తెలుగు లోగిళ్లని మామిడి ఆకులు, బంతిపూలతో అలంకరణ చేస్తారు. నేలపై రంగురంగుల రంగవల్లుల జోరు, నింగిలో పతంగుల పోరు, బంగ్లాలపై డిజేల హోరుతో ఆ సంబరమే వేరు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఇప్పటికే అంబరాన్ని అంటుతున్నాయి.
మీ సంక్రాంతి వేడుకల్లో మీతో పాటు మీ ఆత్మీయులను భాగస్వామ్యం చేసేలా, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మరియు మీ ప్రియమైన వారందరికి శుభాకాంక్షలు తెలిపేందుకు అచ్చమైన తెలుగు పదాల అల్లికలతో సంక్రాంతి పండగ విశిష్టతను చాటే సందేశాలు, వాట్సాప్ - ఫేస్బుక్ మేసేజ్ స్టేస్టస్, ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అనువుగా కొన్ని చిత్రాలు, వాల్ పేపర్స్ అందిస్తున్నాం. వీటిని మీ ప్రియమైన వారికి పంపుతూ, పండగ నాడు వారిని గుర్తు చేసుకుంటూ మీ హార్ధిక శుభాకాంక్షలు అందజేయండి. సంక్రాంతికి ఇంగ్లీషులో గ్రీటింగ్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Sankranti Quotes: పాలలోని తెల్లదనం, చెరుకులోని తియ్యదనం, ముంగిట్లో ముగ్గులోని రంగుల అందం. ఈ అన్నింటి కలయికతో పండగ నాడు కలిపి మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
Sankranti Quotes: తెలుగుదనానికి నిలువెత్తు ప్రతీక. ఆ గాలిపటంలా ఉన్నతంగా ఎగిరే మన ఘనత. జీవితాన్ని రంగులమయం చేసే అచ్చమైన వేడుక మన సంక్రాతి పండుగ. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
Sankranti Quotes: నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు, మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు. పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
Sankranti Quotes: ఆకుపచ్చని మామిడి తోరణాలు, పసుపు పచ్చని మేలిమి సింగారంతో మెరిసే గడపలు. ముంగిట్లో ముగ్గులు, అందమైన గొబ్బెమ్మలు. ఇంటికి తరలివచ్చే ధాన్యరాశులు. ఇదే కదా మన తెలుగింటి సంస్కృతి, ఇదే కదా మన తెలుగింటి పండగ. సంక్రాంతి శుభాకాంక్షలు!
Sankranti Quotes: తరిగిపోని ధాన్యరాశులతో.. తరలివచ్చే సిరిసంపదలతో.. తిరుగులేని అనుబంధాల అల్లికలతో.. మీ జీవితం ఎప్పుడు దినదినం వృద్ధి చెందాలని, మీ ఇంట్లో కలకాలం పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు!
పంటలు చేతికచ్చే వేళ ప్రకృతి పట్ల కృతజ్ఞత, పశుపక్షాదుల పట్ల ప్రేమ, అందరి పట్ల అప్యాయానురాగాలతో, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాసులతో కలిసి సంతోషంగా జరుపుకునే పండగగా సంక్రాంతి పండగ అత్యంత విశేషమైనది. పంటలు సమృద్ధిగా పండాలి, చెరువులు నిండాలి, సుఖసంతోషాలతో లోక కళ్యాణం జరగాలనే ఉద్దేశ్యంతో ఈ పండగను తెలుగు ప్రజలు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. సంక్రాంతి పర్వదినాన దానాలు చేస్తే మరోరూపంలో తిరిగి వస్తుందని శాస్త్రాలు చెబుతాయి.
ఈ సంక్రాంతి పండగ మీకు ఎనలేని సంతోషాలు, మధురమైన జ్ఞాపకాలు ఇవ్వాలని కోరుకుంటూ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున ప్రతి ఒక్కరికీ పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు