File image of Sri Sathya Sai Baba | (Photo Credits: Wikimedia Commons)

శ్రీ సత్యసాయి బాబా జన్మనామం సత్యనారాయణ రాజు, 1926, నవంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లాలో గల పుట్టపర్తి అనే కుగ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబమైన పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి జన్మించారు. సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక ఆయనకు ఆ పేరు పెట్టారు.

అయితే, ఆయన తన 14 ఏళ్ల వయసులో ఇది తనకు పునర్జన్మ అని, ఆ శిరిడి సాయిబాబా మరో అవతారమే తానంటూ తల్లిదండ్రులకు చెప్పారు. తనను నమ్మాల్సిందిగా అనుచరులకు చెప్పుకుంటూ పోయారు. ఆ సమయంలో కొన్ని అద్భుతాలు, మహిమలు చూపించినట్లుగా నివేదికల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత మెల్లిమెలిగా సత్యసాయిబాబాగా అవతరించారు. బాబా ప్రవచించే బోధనలు, సమస్యలకు ఆయన చూపించే పరిష్కారం మార్గం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా లక్షల మంది భక్తులను ఆకర్శించారు.

శ్రీ సత్యసాయి బాబా జయంతి తేదీ, తిథికి సంబంధించిన వివరాలు

 

సత్యసాయి బాబా నవంబర్ 23, 1926 న జన్మించారు. ఈ ఏడాదిలో వస్తున్న ఆయన జయంతి ఆయన ఏప్రిల్ 24, 2011న నిర్యాణం చెంది మహా సమాధి అయిన తరువాత రాబోతున్న తొమ్మిదవ జయంతి అవుతుంది. ఈరోజు మొత్తం సత్యసాయి బాబా భక్తులు అత్యంత పవిత్రమైన దినంగా, శుభకరంగా భావిస్తారు.

 

అశేష భక్తగణం సత్యసాయి సొంతం, పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పుట్టపర్తి పట్టణం

 

కొంతమంది తమకు తాముగా భగవంతుని సేవకులుగా మారి తమ జీవితాలను సత్యసాయిబాబాకు అంకితం ఇచ్చుకుంటూ ఆయన సేవలోనే గడిపారు. అందులో ఒకరు కర్ణాటకకు చెందిన శాకమ్మ అనే భక్తురాలు 1950లో సత్యసాయి బాబా కోసం 'ప్రశాంత నిలయం' కట్టించారు. బాబా తన ఆధ్యాత్మికత, ఎలాంటి బాధలనైనా నయం చేసే గుణంతో భక్త గణాన్ని పెంచుకుంటూ పోయారు. దేశం నలుమూల నుంచే కాకుండా విదేశీ భక్తులు కూడా ఆయన దర్శనం కోసం పుట్టపర్తికి క్యూ కట్టారు. ఆ క్రమంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా 126 దేశాల్లో 1200కు పైగా సత్యసాయి కేంద్రాలు నడుస్తున్నాయి.  సత్యసాయిని విశ్వసించే భక్తుల సంఖ్య దాదాపు 10 కోట్లకు పైగానే ఉంటుందని  ఒక అంచనా.

ఆయన భక్తుల్లో వీవీఐపీలు కూడా ఉన్నారు. ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, ప్రధాన న్యాయమూర్తులు, మరెంతో మంది పొలిటిషియన్లు, సినీ - క్రీడా తారలు ఆయన భక్తులుగా ఉన్నారు. అటల్ బిహారీ వాజిపెయి, నరేంద్ర మోది, అబ్దుల్ కలాం, బాలీవుడ్ అగ్రనేతలు, సచిన్ టెండూల్కర్ లాంటి క్రీడాకారులు పలుమాలు పుట్టపర్తి వచ్చి సత్యసాయిని దర్శించుకునేవారు. అదే విధంగా సత్యసాయి ట్రస్టుకు కోట్లకొలదీ విరాళాలు ప్రపంచం నలుమూల నుంచి వచ్చేవి.

బాబా కారణంగా పుట్టపర్తి రూపురేఖలు మారిపోయాయి, ఏపిలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. సత్యసాయి పేరు మీద ఎన్నో స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు మహిళా సంరక్షణ కేంద్రాలు, అనాధాశ్రయాలు, సేవా కేంద్రాలు ఎన్నో ఏర్పడి సేవలు అందిస్తున్నాయి. పుట్టపర్తిలోనే కాకుండా చాలా నగరాలలో సత్యసాయి ట్రస్ట్ కింద నడిచే ఎన్నో సేవా సంస్థలు, ఎన్నో మంచి మంచి పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నాయి.

కాగా, నవంబర్ 23న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి అనుచరులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

సత్యసాయి స్వస్థలమైన పుట్టపర్తిలో, ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. పట్టణంలో వేణుగోపాల స్వామి రాథోత్సవంతో ప్రారంభమయ్యే సత్యసాయి బాబా జయంతి వేడుకలు ఏడు రోజుల పాటు కొనసాగుతాయి.