Shabe-barat | File Photo

Shab e-Barat 2024: షబ్ ఎ-బరాత్ లేదా చెరాఘ్ ఇ బరాత్ అనేది ముస్లింలు జరుపుకునే ఒక మతపరమైన పర్వదినం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, హిజ్రీ 1445 పవిత్ర మాసం అయిన షబాన్ నెలలో జరుపుకుంటారు. నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే షబాన్ మాసంలోని 15వ తేదీని షబ్-ఎ-బరాత్‌గా జరుపుకుంటారు. ఈ ప్రకారం 2024లో షబ్ ఎ-బరాత్‌ను ఫిబ్రవరి 25వ తేదీన జరుపుకోనున్నారు.

షబ్ ఎ-బరాత్ అంటే ఏమిటి, ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత అలాగే ఈ పవిత్రమైన రోజున ఏయే కార్యాలు నిర్వహిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

షబ్ ఎ-బరాత్ తేదీ

ముస్లింలు షబ్ ఎ-బరాత్‌ను మూడు అత్యంత పవిత్రమైన రాత్రులలో ఒకటిగా భావిస్తారు. పవిత్ర షబ్-ఎ-బరాత్‌ ఫిబ్రవరి 25 రాత్రి గమనించబడుతుంది.

షబ్ ఎ-బరాత్ ప్రాముఖ్యత

షబ్ ఎ-బరాత్ అనేది మస్లింలు చనిపోయిన తమ పూర్వీకుల కోసం ప్రార్థనలు చేసే రాత్రి. తాము చేసిన పాపాలకు క్షమాపణ కోరుకునే సందర్భం. అంతేకాకుండా భవిష్యత్తులో జన్మించే వారి కోసం, అలాగే ఈ లోకం నుండి వెళ్లిపోయేవారి కోసం కూడా ప్రార్థనలు చేస్తారు.

సర్వశక్తిమంతుడైన అల్లా మానవులందరి భవిష్యత్తుకు షబ్ ఎ-బరాత్ రాత్రి మార్గనిర్దేశనం చేస్తాడని ముస్లింల విశ్వాసం. ఈరోజు అల్లా తన భక్తుల 'రిజ్క్' (జీవనోపాధి) ని తదుపరి సంవత్సరానికి నిర్ణయిస్తాడని నమ్ముతారు.

ఈ లోకంలో ఎవరు ఏమి సాధిస్తారు? ఎంత జీవనోపాధి లభిస్తుంది? ఎవరి పాపాలు క్షమించబడతాయి? ఇలా ప్రతి ముస్లిం యొక్క విధి ఈ రాత్రి నిర్ణయించబడుతుంది అని నమ్ముతారు. అల్లా అందరి పాపాలు క్షమించడమే కాకుండా, ఏడాది పొడవునా చేయవలసిన కార్యాలను కూడా తన సేవకులలో ప్రతి ఒక్కరికీ పంచిపెడతాడు. ప్రతి ముస్లిం ఏడాదిలో చేసిన పాప-పుణ్యాల లెక్కలు కూడా ఈ రాత్రికి అల్లా సరి చేసి, వారి సమస్యలను పరిష్కరిస్తాడు అని నమ్ముతారు.

షబ్ ఎ-బరాత్ సందర్భంగా ముస్లిం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు, పవిత్ర ఖురాన్‌ను పఠిస్తారు. మిలాద్, జికిర్ మొదలైన ఇతర మతపరమైన ఆచారాలను నిర్వహిస్తారు, మానవజాతి శ్రేయస్సు కోసం దైవిక ఆశీర్వాదాలు కోరుకుంటారు.

షబ్ ఎ-బరాత్‌లో వీరికి పాపపరిహారం లభించదు

చేసిన నేరాలన్నింటికీ ఈ రాత్రికి అల్లా క్షమాపణలు లభిస్తాయని నమ్ముతారు. అయినప్పటికీ కొందరికి క్షమాపణ ఎంతమాత్రం లభించదు.  అల్లాహ్ క్షమించని తప్పులు చేసేవారు కొందరు ఉంటారు.  తల్లిదండ్రులపై కోపంగా ఉన్న వారిపై, బంధువులను బాధపెట్టిన వారు, తన హృదయంలో ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండేవాడు,  మనుషులతో సరిగా ప్రవర్తించని వారికి క్షమాపణ లభించదు. తన మాట లేదా చేతలతో లేక మరేవిధంగానైనా ఇతరులకు హాని తలపెట్టేవారికి. ఇతరులపై దౌర్జన్యం చేసేవారికి, దయాగుణం- భక్తి లేని వారిని అల్లాహ్ ఎప్పటికీ క్షమించజాలడు అనేది ఇస్లామిక్ విశ్వాసం.