దేశంలో కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ వైరస్ దెబ్బకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే సోకింది ఆ వ్యాధేనా లేక కరోనా అనేది (H3N2 influenza vs COVID-19) చాలా మంది అయోమయంలో పడుతున్నారు. రెండింటి లక్షణాలు ఒకేలా ఉన్నా వీటిలో చాలా తేడాలు (H3N2 influenza vs COVID-19) ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మీకు సోకింది కోవిడా, కొత్త ఫ్లూనా (Influenza H3N2 symptoms) అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా, ఫ్లూ చికిత్సకు ఉపయోగించే మందులు పూర్తిగా వేరని కూడా స్పష్టం చేసింది.
కోవిడ్ లక్షణాలు
కోవిడ్-19 సోకివారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, సైనస్, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.అయితే ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు ఒక్కోసారి బయటపడవు. ఒకటి నుంచి 14 రోజుల వరకు ఇవి ఉండొచ్చు. అయితే లక్షణాలు కన్పించకపోయినా.. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుంది. అలాగే కోవిడ్ సోకిన వారిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది.
హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు
హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, సైనస్, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అయితే ఈ ఫ్లూ బారినపడినవారిలో దగ్గు మాత్రం త్వరగా పోదు. దగ్గు పూర్తిగా తగ్గాలంటే రెండు నుంచి మూడు వారాల వరకు పడుతుంది. ఈ వ్యాధి సోకితే ఆస్పత్రితో చేరాల్సిన అవసరం ఇతర స్ట్రెయిన్‌లతో పోల్చితే అధికంగా ఉంటుంది.
ఇక ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్3ఎన్2 బారినపడి వారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఐసీఎంఆర్ వివరాల ప్రకారం హెచ్3ఎన్2 సోకి ఆస్పత్రిలో చేరినవారిలో 92 శాతం మందికి జ్వరం, 86 శాతం మందికి దగ్గు, 27 శాతం మందికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కన్పించాయి.