కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చుక్కలు చూపిస్తోంది. వ్యాక్సిన్ ఇంకా రాకపోవడంతో ఇది కల్లోలాన్ని రేపుతోంది. దీనిమీద పరిశోధనలు చేస్తున్న పరిశోధకులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా మరో కొత్త న్యూస్ బయటకు వచ్చింది. కోవిడ్ (Covid) బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో గురక పెట్టి పడుకునే వాళ్లు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు మూడు రెట్లు ముప్పు ఎక్కువని (Snoring increases risk of Covid-19) పరిశోధకులు తేల్చారు.
కరోనా వైరస్, నిద్రకున్న సంబంధంపై ఇప్పటి వరకు జరిపిన 18 అధ్యయనాలను వార్‌విక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చారు. గురక పెడుతూ నిద్రపోయే వారిలో (Obstructive sleep apnea) కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా పోదని, ఫలితంగా వారికి ప్రాణాపాయం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.
అయితే గురక పెట్టేవాళ్లకు కరోనా సోకడం ఒక రిస్క్ ఫ్యాక్టరేకానీ, అదనపు రిస్క్ ఫ్యాక్టర్ కాదని పరిశోధకులు చెప్పారు. అంటే స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం ఉన్నట్లయితే ఆ మూడే వారికి రిస్క్ ఫ్యాక్టర్లని, వారిలో గురకపెట్టే వారున్నట్లయితే వారికి అది అదనపు రిస్క్ ఫ్యాక్టర్ కాబోదని కూడా పరిశోధకులు తెలిపారు. వాస్తవానికి ఈ మూడు అనారోగ్య సమస్యలున్న వారందరికి గురకపెట్టే అలవాటు వస్తుందని వారు చెప్పారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌లో 15 లక్షల మంది, అమెరికాలో 2.20 కోట్ల మంది గురక సమస్యతో బాధ పడుతున్నారు.