COVID19 Kit: తెలంగాణలో ఇంటి వద్దకే కరోనా కిట్, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
Home Isolation Kit by Telangana Govt | File Photo

Hyderabad, July 11:  తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకి కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీంతో చాలా మంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారించబడిన వారు వారి ఇంట్లో నుండే చికిత్స పొందుతున్నారు. ఒకసారి వైద్య పరీక్షల్లో కరోనా అని తేలితే ఆసుపత్రిలోనే చికిత్స అని కాకుండా, రోగి కోసం వారి ఇంట్లో ప్రత్యేక గది ఏర్పాటు ఉంటే, ఇంట్లో నుంచే చికిత్స పొందేందుకు ప్రభుత్వం అనుమతిని ఇస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 వేల మంది వరకు కొవిడ్ పేషెంట్లు హోం ఐసోలేషన్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

కరోనా పాజిటివ్ పేషెంట్లు తమ గది నుంచి బయటకు రావటానికి అనుమతి ఉండదు. అయితే అందరి ఇంట్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. కొంతమంది పేషేంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో మందుల బయటకు రావడం చేస్తున్నారు. దీనివల్ల వారి ద్వారా మరింత మందికి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వారి కోసం ప్రభుత్వమే నేరుగా వారి ఇంటికి 'ఐసోలేషన్ కిట్' అందించాలని నిర్ణయించింది. ఇంట్లో ఎంతమంది పేషెంట్లు ఉంటే అంతమందికి కావాల్సిన కిట్లను దగ్గర్లోని ఆరోగ్య కేంద్రం నుంచి పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ కిట్ లో హైడ్రోక్లోరోక్విన్, లివోసెటిరిజైన్, పారాసిటమాల్, విటమిన్ సి, డి మరియు ఇ టాబ్లెట్లు, యాంటిబయాటిక్స్ తదితర ఔషధాలతో పాటు శానిటైజర్, హ్యాండ్ వాష్ లిక్విడ్, మాస్కులు, గ్లౌజులు అలాగే హోం ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏ ఔషధాలు ఎంత మోతాదులో వేసుకోవాలి, వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి? మొదలగు సందేహాలను నివృత్తి చేసే ఓ పుస్తకంను కిట్ లో అందజేస్తున్నారు.

Update by State Health Ministry:

 

"ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి ఐసొలేషన్‌ కిట్‌ ను నేరుగా సిబ్బంది ఇంటికెళ్లి అందజేస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా కూడా బాధితులందరికీ కిట్లను ఇస్తారు,  వైద్య సిబ్బంది ఫోన్‌ ద్వారా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటుంది. చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను ప్రభుత్వమే ఉచితంగా కిట్ ద్వారా సమకూరుస్తుంది" అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ పేర్కొన్నారు.