Ayodhya, Jan 22: యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే (Ayodhya Ram Mandir Inauguration) జరుగనున్నది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రాణప్రతిష్ఠ (Prana prathishta) కార్యక్రమం ముగుస్తుంది. రామమందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు (Lord Sri Ram) కొలువుదీరనున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ సహా 7 వేల మందికి పైగా ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ మహత్తర కార్యం జరగనున్నది. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షల మంది టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో వీక్షించనున్నారు. ఈ శుభ ముహూర్తాన దేశ విదేశాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.
వాషింగ్టన్ డీసీ నుంచి ప్యారిస్.. సిడ్నీ దాకా
వాషింగ్టన్ డీసీ నుంచి ప్యారిస్.. సిడ్నీ దాకా దాదాపు 60 దేశాల్లో విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లైవ్ కవరేజీ, రథయాత్రలు, కారు, ఆటో ర్యాలీలు, హిందూ ఆలయాల్లో దీపాల వేడుక వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు న్యూయార్క్ లోని టైమ్స్ స్కేర్ సహా అమెరికాలోని 300 ప్రముఖ ప్రదేశాల్లో ఏర్పాట్లు జరిగాయి. మారిషస్ జనాభాలో 48 శాతం హిందువులే. నేడు ఆ దేశంలోని ప్రభుత్వం, హిందూ ప్రభుత్వ అధికారులకు రెండు గంటల స్పెషల్ బ్రేక్ (విరామం) ప్రకటించింది. ఇక ఫ్రాన్స్ లో భారతీయులు ‘గ్రాండ్ రథయాత్ర’ను చేపట్టారు.